ఆర్టీసీ చార్జీలు పెంచబోం: మహేందర్ రెడ్డి

28 Oct, 2015 07:43 IST|Sakshi
ఆర్టీసీ చార్జీలు పెంచబోం: మహేందర్ రెడ్డి

మరో 400 పల్లె వెలుగు బస్సుల కొనుగోలు
ఇందూరు: తెలంగాణలో ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచబోమని రోడ్డు రవాణా శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెడతామన్నారు. ఇందుకు గాను రూ.కోట్లు వెచ్చించి బస్టాండ్‌లలో అభివృద్ధి పనులు చేయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 500 అద్దె బస్సులను తీసుకున్నామని, పల్లె వెలుగు కోసం 400 వరకు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని పది జిల్లాల్లో 95 బస్సు డిపోల్లో 21 డిపోలు లాభాల్లో ఉన్నాయన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీకి అవసరమైన నిధులు కూడా ఇస్తున్నారని, ఇటీవలే రూ. 18 కోట్ల ఇంక్రిమెంట్లు, 44 శాతం పీఆర్‌సీ ఇచ్చారని పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు బంగారు తెలంగాణ కోసం 8 గంటలకు బదులు 12 గంటలు విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. బస్ డిపోల్లో, బస్టాండ్‌లలో సీసీరోడ్లు వేయించడానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపల్లెకు బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని, ఇందుకుగాను  గ్రామీణ రోడ్లు వేయించేందుకు రూ.10 వేల కోట్లు మం జూరు చేశామని చెప్పారు. జిల్లా, నియోజవర్గ కేంద్రాల నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపనున్నామన్నారు.

 

>
మరిన్ని వార్తలు