ప్రజలను ఇబ్బంది  పెట్టేందుకే సమ్మె

13 Oct, 2019 03:16 IST|Sakshi

మీడియా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ పేర్కొన్నారు. దసరా సమయంలో లక్షలాది మంది గ్రామాలకు వెళ్లే సమయంలో సమ్మె చేయడం వెనుక అర్థం ఇదేనని, ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసేలా సమ్మెను చేపట్టారన్నారు. ఈనెల ఐదోతేదీ సాయంత్రం ఆరుగంటల్లోపు విధుల్లో చేరిన వారిని మాత్రమే కార్మికులుగా పరిగణిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. విధుల్లో చేరని వారు కార్మికులు కాదని, వారితో చర్చలు జరపాల్సిన అవసరం లేదన్నారు.

శనివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో జరిగిన సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం కేసీఆర్‌ ఎన్నడూ చెప్పలేదని మంత్రి స్పష్టం చేశారు. చెప్పని మాటలను చెప్పినట్లు కార్మికులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది సమంజసం కాదని మంత్రి సూచించారు. దసరా రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులతో పాటు స్కూల్, కాలేజీ బస్సులను నడిపించామని, ప్రస్తుతం ఆ అవసరం లేదన్నారు. సమ్మెను ప్రయాణికుల మీద, ప్రభుత్వం మీద బలవంతంగా రుద్దారని మంత్రి మండిపడ్డారు.

అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు  
తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడుస్తున్న ఆర్టీసీ సర్వీసులతో పాటు వివిధ ప్రైవేటు వాహనాల్లోఅధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పువ్వాడ హెచ్చరించారు. సమ్మె విషయంలో ప్రభుత్వం అన్ని విధా లుగా సిద్ధంగా ఉందన్నారు. సమ్మె పరిష్కారం కోసం ముగ్గురు ఐఏఎస్‌లతో ప్రభుత్వం కమిటీని నియమించిందని, దానికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ కూడా ముగిసిందని ఈనెల నాలుగో తేదీనే చెప్పామని, బస్సులను నడిపేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ప్రతి ఆర్‌ఎం కింద పోలీసు సిబ్బంది ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. అన్ని రకాల పాసులు అనుమతిస్తామని, ఈ విషయంలో ఆదేశాలు సైతం ఇచ్చామన్నారు.

మరిన్ని వార్తలు