రవాణా శాఖ లక్ష్యం రూ. 2,900 కోట్లు

7 Feb, 2017 01:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2,900 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రవాణా శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. సోమవారం సచివాలయంలో రవాణా, ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదాయాన్ని పెంచుకు నేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు రవాణాశాఖ కార్యదర్శి సునీల్‌శర్మ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌ నేపథ్యంలో రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు పొందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ నెల 8న ఢిల్లీలో ఆయా శాఖల మంత్రులకు వాటిని అందజేస్తామన్నారు. ప్రస్తుతం రవాణా శాఖకు 13 సొంత భవనాలు మాత్రమే ఉన్నందున మిగతావాటికి రూ.30 కోట్లు అవసరమ వుతాయని అంచనా వేశారు. డ్రైవింగ్‌ ట్రాక్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేసేందుకు రూ.17 కోట్లు కావాలని అధికారులు కోరారు. ఆర్టీసీకి కొత్త బస్సుల కోసం రూ.140 కోట్లు ప్రతిపాదించారు. సమావేశంలో ఆర్టీసీ ఎండీ రమణారావు, రవాణా శాఖ జేటీసీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు