అర్థరాత్రి ఔటర్ పై ప్రయాణికుల జాగారం...

25 Feb, 2015 10:21 IST|Sakshi
అర్థరాత్రి ఔటర్ పై ప్రయాణికుల జాగారం...

హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ అరాచకాలకు హద్దు లేకుండా పోతోంది. క్షేమంగా గమ్యానికి చేర్చాలిన బస్సులు ప్రయాణికులను నడిరోడ్డు పైనే వదిలేస్తున్నాయి. నిన్నదీపికా ట్రావెల్స్... నేడు న్యూ ధనుంజయ ట్రావెల్స్... ప్రయాణికులను నడిరోడ్డుపై రాత్రంతా జాగారం చేయించాయి. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో విశాఖపట్నం బయల్దేరిన న్యూ ధనుంజయ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ అవుటర్ రింగ్‌ రోడ్డుపైన నిలిచిపోయింది.

ఎయిర్ లాక్ అయిందంటూ బస్సును అర్ధంతరంగా నిలిపివేసిన డ్రైవర్ తనకు బాధ్యత లేదన్నట్టు వ్యవహరించాడు. ట్రావెల్స్ యాజమాన్యం కూడా మరో బస్సు ఏర్పాటు చేయకుండా చేతులెత్తేయడంతో ప్రయాణికులు రాత్రంతా అవుటర్‌పై అవస్థలు పడ్డారు. ట్రావెల్స్ మేనేజ్‌మెంట్‌కి ఫోన్‌ చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు.

 

దీంతో రాత్రంతా ప్రయాణికులు పడిగాపులు కాశారు. టికెట్ల రూపంలో వేలకువేలు గుంజి...ఆపద సమయంలో కనీసం తమవైపు కన్నెత్తైనా చూడలేదని ప్రయాణికులు వాపోయారు. బుధవారం ఉదయం వరకూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు