సకలం అస్తవ్యస్తం!

17 Nov, 2019 04:33 IST|Sakshi

సగటు జీవిపై ఆర్టీసీ సమ్మె ప్రభావం

కొన్ని రోజులుగా అస్తవ్యస్తంగా ‘రవాణా’

విద్యా సంస్థల్లో పడిపోయిన ‘హాజరు’

విద్యార్థులు, రైతులు, ఉద్యోగులకు ప్రయాణ చార్జీలు తడిసిమోపెడు..

శంషాబాద్‌లోని ఓ జూనియర్‌ కాలేజీలో 550 మంది విద్యార్థులున్నారు. మండల పరిధిలోని గ్రామాలతో పాటు షాబాద్, మహేశ్వరం ప్రాంతాలకు చెందిన విద్యార్థులే వీరంతా. ఈ కాలేజీలో 90 శాతంపైగా ఉన్న హాజరు, ఆర్టీసీ సమ్మెతో 40 శాతానికి పడిపోయింది. రోజుకు సగటున 150 మందే హాజరవుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో హాజరు శాతం భారీగా తగ్గింది. విద్యాసంస్థలకు కాలినడకన వచ్చే వారు మినహాయిస్తే గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు బస్సుల్లేక  రోజుల తరబడి చదువులకు దూరం అవుతున్నారు.

సగటు జీవి రోజువారీ జీవన విధానంలో ప్రగతి రథం ఒక భాగం. స్కూలు విద్యార్థి మొదలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులతో పాటు వ్యవసాయ కూలీలు, రైతులు... ఇలా అన్ని వర్గాల ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చే ఆర్టీసీకి సమ్మె పోటు తగిలింది. చాలా రోజులుగా  కార్మికులు సమ్మె చేస్తుండగా, యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను రోడ్డెక్కిస్తోంది. కానీ అవి పరిమిత రూట్లలో, ప్రధాన రహదారుల్లో మాత్రమే సేవలందిస్తుండడంతో మెజార్టీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి చేతి చమురు వదిలించుకుంటున్నారు. ఆర్టీసీలో నెలకు వెయ్యి రూపాయలయ్యే ప్రయాణం ప్రైవేట్‌ పుణ్యమా అని ఇప్పుడు నాలుగు వేలకు చేరిందని లబోదిబోమంటున్నారు. ఆర్టీసీలో 10 వేల బస్సుల ద్వా రా రోజుకు సగటున కోటి మందికి సేవలందుతున్నాయి. సమ్మె నేపథ్యంలో 60 శాతం బస్సులను తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో నడుపుతున్నా ప్రధాన రహదారులకే పరిమితమవుతున్నాయి.

జిల్లా, తాలూకా కేంద్రాలు, హై దరాబాద్‌కు వచ్చే రూట్లలో ఇవి నడుస్తున్నా యి. గ్రామాలు, మారుమూల పల్లెలకు చాలా రోజులుగా బస్సు వెళ్లకపోవడం గమనార్హం. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు ఇబ్బడిముబ్బడిగా వసూళ్లకు తెగబడుతున్నారు. మరో వైపు సరుకు రవాణా కు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న రైతులు, ఆ ప్రభావాన్ని దిగుబడుల విక్రయాలపై చూపుతూ ధరలు పెంచేస్తున్నారు.

నిత్యం ఆలస్యమే...
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులుంటారు. బస్సులు లేకపోవడంతో వ్యక్తిగత వాహనాల్లో వెళ్లడం లేదా ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సకాలంలో దొరకకపోవడంతో సమయపాలన గాడితప్పుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు కనీసం అరగంట ఆలస్యంగా రావడంతో పాటు ముందుగా వెళ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా పాఠశాలల్లో కూడా టీచర్లు ఆలస్యంగా వస్తున్నారనే ఫిర్యాదులు విద్యాశాఖాధికారులకు వస్తున్నాయి. కార్తీకమాసం శుభకార్యాలకు ప్రసిద్ధి కావడంతో ప్రయాణాలు సైతం అధికమే. ఈ సమయంలో దూరప్రయాణాలకు వెళ్లే వారు సమ్మె కారణంగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

దందా ఆగమైంది...
సమ్మెతో గిరాకీ దెబ్బతిన్నది. బస్టాండ్‌కు వచ్చే వారంతా మా హోటల్‌లో ఏదో ఒకటి తినేవారు. సమ్మె ప్రభావంతో బస్సుల సంఖ్య తగ్గడం, గ్రామాలకు వెళ్లే వారంతా బస్టాండ్‌కు రాకపోవడంతో గిరాకీ డౌన్‌ అయ్యింది. సమ్మెకు ముందు రోజుకు సగటున 24వేల వరకు గిరాకీ అయ్యేది. ఇప్పుడు 8వేల నుంచి 9వేల వరకు మాత్రమే బేరమవుతుంది.  
– శ్రీకాంత్, హోటల్‌ నిర్వాహకుడు, సంగారెడ్డి కొత్త బస్టాండ్‌ కాంప్లెక్స్‌

గిట్టుబాటు అయితలేదు
కూరగాయ దిగుబడులను బస్‌ ద్వారా రైతు బజార్‌కు తరలించేవాళ్లం. ఇప్పుడు బస్సులు రాకపోవడంతో ఆటో ట్రాలీని కట్టుకుని తీసుకెళ్తున్నాం. నలుగురైదుగురు రైతులం కలిసి ఆటోలో వెళ్లడంతో ఒక్కొక్కరికి కనీసం రూ.300 వరకు ఖర్చు వస్తున్నది. బస్సులో వెళ్తే గరిష్టంగా రూ.100 లోపు ఉండేది. దీంతో రైతుబజార్‌కు వెళ్లి పంట దిగుబడులు అమ్మితే ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. రోజుకు రూ.300 పెట్టాలంటే ఆచ్చే ఆదాయం ఏముంటుంది.
– పి.నర్సింలు, రైతు, ఆలూరు, చేవెళ్ల

ఆటో ఖర్చు నెలకు రూ.వెయ్యి
మా ఊరి నుంచి స్కూల్‌ 8 కిలోమీటర్లు. సాధార ణ రోజుల్లో నెలకు రూ. 125 చెల్లించి బస్‌పాస్‌ ద్వారా ప్రయాణించేవాడిని. ఇప్పుడు బస్సులు బంద్‌ కావడంతో నిత్యం ఆటోలో వెళ్తున్నా. పదో తరగతి కావడంతో ఒక్క క్లాస్‌ కూడా మిస్‌ కావొద్దని అమ్మానాన్నలు రోజువారీ ఆటో చార్జీలు ఎంతో కష్టపడి ఇస్తున్నారు. ఆర్టీసీ సమ్మె వల్ల ఒక నెల రోజుల్లోనే ఆటోలో ప్రయాణానికి దాదాపు వెయ్యి రూపాయలు ఖర్చు చేశా.
–ప్రవీణ్, పదో తరగతి, ఏట్ల ఎర్రవల్లి గ్రామం, షాబాద్‌ మండలం, రంగారెడ్డి జిల్లా

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా