ఒక్క‘ట్రీ’ బతకలేదు!

18 Jun, 2018 12:12 IST|Sakshi
సిరిసిల్ల బైపాస్‌ రోడ్డులో ఎండిన చెట్టు 

విఫలమైన ట్రాన్స్‌ప్లాంటేషన్‌

రూ.5 లక్షల ప్రజాధనం వృథా

ఎండిపోయినన 55 చెట్లు

బోసిపోయిన బైపాస్‌రోడ్డు

పర్యవేక్షణ లోపమే కారణం

సాక్షి, సిరిసిల్ల :  జిల్లాకేంద్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణకు ఆటంకంగా మారిన ఏళ్లనాటి వృక్షాలను తొలగించిన అధికారులు.. వాటిని శాస్త్రీయ పద్ధతిన సంరక్షించేందుకు తీసుకున్న చర్యలు విఫలమయ్యాయి. 2017 జూన్‌లో ఆర్‌ అండ్‌ బీ, అటవీశాఖ అధికారులు తొలగించిన చెట్లకు ప్రాణం పోసేందుకు చేసిన కృషి మట్టిపాలైంది. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా నాటిన 55 చెట్లు బతకలేదు. మొత్తం 300 వృక్షాలకు పునరుజ్జీవం పోసేందుకు రూ.36 లక్షలు కేటాయించగా.. 55 చెట్లను క్రేన్ల సాయంతో మట్టితో సహా పెకిలించి పట్టణ శివారులోని బైపాస్‌ రోడ్డులో నాటారు. సంరక్షణ చర్యలు విస్మరించడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి.


ఏళ్లనాటి చెట్లు ఎండిపోయాయి..
పట్టణంలో 20 – 30ఏళ్ల క్రితం చెట్లు రోడ్డు విస్తరణలో తొలగించాల్సి వచ్చింది. ఫారెస్ట్, ఆర్‌ అండ్‌ బీ శాఖల అధికారులు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకుని చెట్లను తొలగించే పనులు చేపట్టారు. చెట్ల కొమ్మలు తొలగించి, వేర్లతో సహా పెలించారు. అయితే, మట్టి వాటి వేర్లకు అంటుకుని ఉండకపోవడంతో చెట్లు వాడిపోయాయి. వాటిని నాటిన ప్రాంత భూసారం, అవి పెరిగిన ప్రాంత భూసారానికి తేడా ఉండడంతో వృక్షాలు జీవం పోసులేకపోయాయని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు అప్పట్లో చెట్లను రక్షించేందుకు చేపట్టిన చర్యలు అభినందనీయం కాగా.. ఆ చెట్లు ఒక్కటీ దక్కకపోవడం బాధాకరం.

కొన్ని నాటి ఆపేశాం 
జిల్లాకేంద్రంలో 300 చెట్లను తరలించాలని భావించాం. కానీ కొన్ని చెట్లను తరలించిన తర్వాత అవి బతికే అవకాశం లేదని తెలిసింది. వేర్లకు మట్టి అంటుకుని ఉండలేదు. ఇది గుర్తించి మిగితా వాటిని నాటకుండానే వదిలేశాం. కొత్త విధానంలో ఇలాంటివి సహజంగానే జరుగుతుంటాయి. 
– విఘ్నేశ్వర్‌రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ ఈఈ

మరిన్ని వార్తలు