పత్రికల ధోరణి మారాలి

26 Jan, 2015 11:48 IST|Sakshi
పత్రికల ధోరణి మారాలి
  • నేల విడిచి సాము చేసే తీరు మార్చుకోవాలి  
  • ‘మన తెలంగాణ’ ఆవిష్కరణ సభలో సీఎం కేసీఆర్
  • ప్రజలను చైతన్య పరిచే వార్తలు రాయాలి
  • తెలంగాణవారికి పత్రికలు నడపడం రాదన్నందుకే దురుసుగా మాట్లాడా
  • సాక్షి, హైదరాబాద్: ‘కొన్ని పత్రికలు నేల విడిచి సాము చేస్తున్నాయి. మేము రాసిందే వార్త అనే ధోరణిలో కొన్ని.. మాతో మంచిగా ఉండకుంటే వ్యతిరేక వార్తలు రాస్తామనే తీరుతో కొన్ని ఉన్నాయి. ఇదో విషవలయంగా మారింది. పత్రికా లోకానికి నా విజ్ఞప్తి ఒక్కటే. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో అనవసర అపోహలు, సందేహాలు లేవనెత్తకుండా ప్రజలను చైతన్యపరిచేలా వార్తలు రాయాలి. సమాజానికి కరదీపికలు, వైతాళికులు పాత్రికేయులే’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు.

    ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ‘మన తెలంగాణ’ పత్రికతోపాటు పత్రిక వెబ్‌పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో రాత రాసినా, గీత గీసినా, బొమ్మ చూపినా మేమే అనే తరహాలో ఉద్యమ వ్యతిరేక శక్తులు వ్యవహరించాయని, కానీ ఉద్యమ తీవ్రత వారి అభిప్రాయాన్ని పటాపంచలు చేసిందన్నారు. తెలంగాణ వారికి పత్రికలు నడపటం వచ్చా? అనే మాటలు వినాల్సి వచ్చిందని, వాటికి ధీటుగా సమాధానం చెప్పేందుకే తాను కొన్ని సందర్భాల్లో దురుసుగా మాట్లాడాల్సి వచ్చిందని, అవి దురుద్దేశంతో మాట్లాడిన మాటలు కాదని చెప్పారు.

    రాష్ట్రంలో కొన్ని కుల పత్రికలు, కొన్ని గుల పత్రికలున్నాయంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఆయన మరోసారి గుర్తుచేశారు. మన తెలంగాణ పత్రిక తెలంగాణ కళ్లతో తెలంగాణను చూసి తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా ఉండాలని సూచించారు. ఆలపాటి ధర్మారావు డిప్యూటీ స్పీకర్‌గా ఉండగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తాను వ్యవసాయంపై అసెంబ్లీలో 78 నిమిషాలపాటు మాట్లాడితే తెల్లారి పత్రికల్లో నాలుగు లైన్ల వార్తే రాశారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. సభలో బుక్కో, బాటిలో విసిరితే పత్రికలు బ్యానర్ వార్తగా రాస్తున్నాయని, ఈ పద్ధతి మారాలన్నారు. పిడివాదంతో ఉంటారని అనుకునే కమ్యూనిస్టులు తెలంగాణ ఏర్పాటుతో ఆలోచన తీరు మార్చుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
     
    మార్పునకు అనుగుణంగానే: ఎడిటర్

    రాజకీయ పరిణామాల్లో వచ్చిన మార్పుతో పత్రికలు అవలంభిస్తున్న ధోరణి చూశాక ‘మన తెలంగాణ’ పత్రికను ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందని పత్రిక సంపాదకులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ యాజమాన్యం ఉండే పత్రికలు రావాలన్న కేసీఆర్ మాటలు కూడా ప్రేరణ కలిగించాయన్నారు. ‘విశాలాంధ్ర’పై ఉన్న సీపీఐ పత్రిక ముద్రను చెరిపేందుకు, ప్రజలు కోరుకునేలా పత్రిక ఉండాలనే ఉద్దేశంతో ‘మన తెలంగాణ’ను ప్రారంభించామన్నారు. పత్రిక 18 నెలల మనుగడ సాగించాకే ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చే నిబంధన నుంచి మినహాయింపునిస్తూ తమ పత్రికకు ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కేకే, కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, టీడీపీ తెలంగాణశాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కీర్తిస్తూ పాట రాసిన సుద్దాల అశోక్‌తేజ, దాన్ని ఆలపించిన వందేమాతరం శ్రీనివాస్, మన తెలంగాణ పత్రికపై గోరటి వెంకన్న రాసిన పాటను ఆలపించిన తెలంగాణ ప్రజానాట్యమండలి ప్రతినిధిని సీఎం శాలువాలతో సత్కరించారు.
     

మరిన్ని వార్తలు