సర్కారు నిర్లక్ష్యం.. గిరిజనులకు శాపం

15 Jun, 2015 02:30 IST|Sakshi
సర్కారు నిర్లక్ష్యం.. గిరిజనులకు శాపం

సాక్షి, హైదరాబాద్ : మన్యం వాసులను ఓ మహమ్మారి బలి తీసుకుంటోంది.. గిరిజన గూడెంలలో తీరని శోకం మిగులుస్తోంది.. జన్యుపరమైన ప్రాణాంతక వ్యాధి సికిల్ సెల్ అనీమియా ఏజెన్సీని చాపకింద నీరులా చుట్టేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. దీంతో అంతుచిక్కని రోగంతో అడవి బిడ్డలు ప్రాణాలు వదులుతున్నారు. ఇటీవల తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూరు-టి ప్రాంతాల్లోని గిరిజనులకు రక్త పరీక్షలు నిర్వహించగా వారికి ఈ ప్రాణాంతక వ్యాధి లక్షణాలున్నట్లు బయటపడింది. మంచిర్యాలలోని ఆస్పత్రుల్లో ఈ కేసులను గుర్తించినట్లు ప్రభుత్వానికి నివేదికలు సైతం అందాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ఏజెన్సీలో ఈ వ్యాధి విస్తరిస్తున్నట్లు ఇదివరకే ‘సాక్షి’ రుజువులతో సహా వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ముందుజాగ్రత్త తప్ప మందే లేని ఈ వ్యాధి నుంచి గిరిజనులను కాపాడేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు.
 
 అడుగడుగునా సర్కారు నిర్లక్ష్యం..
 గిరిజన విద్యాసంస్థల్లోని విద్యార్థులకు నిర్వహించిన రక్త పరీక్షల్లో  సికిల్ సెల్ అనీమియా కేసులు ఎక్కువ బయటపడుతున్నాయి. ఈ వ్యాధిపై కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా స్పందించి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రూ. కోటి మంజూరు చేసింది. కానీ, 10 నెలలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాధి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గిరిజన విద్యార్థులకు హెల్త్ మ్యాపింగ్ చేసి, మలేరియాతో పాటుగా సికిల్ సెల్ అనీమియాకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ కమిటీ రాష్ట్ర ఉన్నతాధికారులకు సూచించినా మొక్కుబడి చర్యలనే తీసుకున్నారు. గిరిజనులు అధికంగా ఉండే ఖమ్మం జిల్లాలో స్క్రీనింగ్, డయాగ్నిస్టిక్ అవసరాల కోసం రూ.12 లక్షలతో హేపీసీఎల్ మిషన్‌ను కొనేందుకు, స్క్రీనింగ్ టెస్ట్‌కు అవసరమైన వస్తువుల కోసం రూ.4 లక్షలు అవసరమవుతాయని ఆ జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. ఇక మిగిలిన జిల్లాల్లో కనీసం సికిల్ సెల్ అనీమియా పరీక్షలు కూడా చేయలేదు.
 
 వ్యాధి లక్షణాలు ఇవీ..
 సాధారణంగా మనిషి రక్తంలో గుండ్రటి ఆకారంలో ఉండే ఎర్రరక్తకణాలు రక్తనాళాల ద్వారా శరీరంలో ప్రయాణిస్తూ వివిధ అవయవాలకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. జన్యుపరమైన మార్పులు సంభవించే కొందరిలో రక్తకణాలు కొడవలి ఆకారంలో మారి రక్తనాళాల ద్వారా ప్రయాణించడం కష్టంగా మారుతుంది. దీనివల్ల శరీర భాగాలకు ఆక్సిజన్ అందదు. ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణం ఆయుప్రమాణం 125 రోజులు కాగా, సికిల్‌సెల్ ఆయుప్రమాణం కేవలం 20 రోజులే. త్వరగా నశించిపోయే రక్త కణాలకు ధీటుగా ఎముకల్లోని మూలుగు (బోన్‌మారో) కొత్త రక్తకణాలను ఉత్పత్తి చేయలేదు. దీనితో రోగి రక్తహీనత బారిన పడి చనిపోతాడు. జన్యుమార్పుల కారణంగా వచ్చే ఈ వ్యాధికి మందు లేదు. ఇది వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎర్ర రక్త కణంలో ఒక జన్యువు మామూలుగా, మరొకటి వంపు తిరిగి ఉంటే (సికిల్) వారిని సికిల్ క్యారియర్లుగా పేర్కొంటారు. వీరికి ఎలాంటి అనారోగ్యం ఉండదు. అయితే ఇలాంటి ఇద్దరు క్యారియర్లు వివాహం చేసుకుంటే వారికి పుట్టే పిల్లల రక్త కణాల్లో రెండు జన్యువులు వంపు తిరిగి ఉంటాయి. వీరిని సికిల్ రోగులుగా పిలుస్తారు. వీరు పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో ఉంటారు. అధికశాతం మంది 15-20 ఏళ్లకే చనిపోతారు.

మరిన్ని వార్తలు