రేణుక పై గిరిజన సంఘాల ఫిర్యాదు

29 Apr, 2015 03:18 IST|Sakshi
రేణుక పై గిరిజన సంఘాల ఫిర్యాదు

- పార్టీ టికెట్ ఇప్పిస్తానని మోసం చేశారు
- ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ఎదుట గిరిజనుల ఆందోళన

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గత సార్వత్రిక ఎన్నికల్లో వైరా శాసనసభ స్థానానికి టికెట్ ఇప్పిస్తానని రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి రూ.1.10 కోట్లు తీసుకున్నారని  ఇటీవల మృతి చెందిన డాక్టర్ రాంజీ సతీమణి కళావతి, గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం ఏఐసీసీ కార్యదర్శి కుంతియా ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్షించేందుకు డీసీసీ కార్యాలయంలో కుంతియా, భట్టి విక్రమార్క, షబ్బీర్‌అలీతోపాటు జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న గిరిజన సంఘం నాయకులు నినాదాలు, ప్లకార్డులతో ప్రదర్శనగా డీసీసీ కార్యాలయానికి వచ్చారు. పోలీసులు గిరిజన సంఘం నాయకులను అడ్డుకున్నారు. కుంతియాను కలసి మాట్లాడాలని  గిరిజన సంఘాల నాయకులు పట్టుబట్టడంతో కళావతితో పాటు పలువురు నాయకులకు గదిలోకి  వెళ్లేందుకు అనుమతించారు.

పార్టీ టికెట్ ఇప్పిస్తానని రాంజీకి మాయమాటలు చెప్పిందని, పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో మనోవేదనతో ఆయన మృతి చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కుంతియాకు వినతిపత్రం అందజేశారు.  కుంతియా మాట్లాడుతూ మీ సమస్యలను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తానన్నారు.  సోనియాగాంధీ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తానని మీ ఇవ్వడంతో గిరిజన సంఘాల నాయకులు శాంతించారు.

మరిన్ని వార్తలు