తయారీ యూనిట్లపై జీసీసీ కసరత్తు

20 May, 2019 03:03 IST|Sakshi

తృణధాన్యాల ఉత్పత్తులే లక్ష్యంగా అడుగులు

కొత్తగా 25 యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు

ఒక్కో యూనిట్‌ ధర గరిష్టంగా రూ.40 లక్షలు

సాక్షి, హైదరాబాద్‌: వ్యాపార వృద్ధిలో భాగంగా గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (జీసీసీ) తయారీ యూనిట్ల ఏర్పాటువైపు దృష్టి సారించింది. గిరి తేనె, సహజ సిద్ధమైన సబ్బులు, షాంపూల తయారీతో బహిరంగ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన జీసీసీ.. తాజాగా తృణధాన్యాల ఉత్పత్తుల వైపు దృష్టి పెట్టింది. జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జలతో తయారుచేసిన సహజసిద్ధమైన స్వీట్లు, స్నాక్స్, వంటకాలకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. ఈ దిగుబడులకు ధరలు సైతం అధికంగా ఉండటంతో గిరిజన సంక్షేమ శాఖ యంత్రాంగం ఐటీడీఏ ప్రాంతాల్లోని గిరిజన రైతాంగాన్ని వీటి సాగుకు ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో వచ్చిన పంట దిగుబడులను ప్రాసెసింగ్‌ చేసి వాటి ద్వారా ఆహార పదార్థాల తయారీకి కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

25 యూనిట్ల ఏర్పాటు..
ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో జీసీసీకి తేనె పరిశ్రమలు ఉన్నాయి. ఏటూరు నాగారం పరిధిలో సబ్బులు, షాంపూల తయారీ యూనిట్లున్నాయి. వీటితోపాటు నగరంలోని కొన్ని పరిశ్రమలను లీజు రూపంలో తీసుకుని అక్కడ వివిధ రకాల సబ్బులు, షాంపూలు తయారు చేసి మార్కెట్‌లోకి తెస్తున్నారు. ప్రస్తుత ప్రొడక్షన్‌ బహిరంగ మార్కెట్‌లో కంటే సం క్షేమ వసతి గృహాలు, గురుకులాలకే సరిపోతోంది. డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేయాలనే ఉద్దేశంతో జీసీసీ కొత్త యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఒక్కో యూనిట్‌ను గరిష్టంగా రూ.40 లక్షలతో ప్రారంభించాలని భావిస్తోంది. రాష్ట్రంలోని మూడు ఐటీడీఏల పరిధిలో ప్రాధాన్యతా క్రమంలో వీటిని ఏర్పాటు చేస్తారు.

పంట దిగుబడులను బట్టి యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. దాదాపు రూ.10 కోట్లతో తయారీ యూనిట్లను నెలకొల్పాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిలో 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిస్థాయి ప్రాజెక్టు రిపోర్టును సమర్పిస్తే కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నుంచి 60 శాతం గ్రాంటు రానుం దని అధికారులు భావిస్తున్నారు. మిగతా 30 శాతం బ్యాంకు రుణం ద్వారా, మరో పది శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే ఈ యూనిట్లను నెలకొల్పుతున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.   

మరిన్ని వార్తలు