ఆదిలాబాద్‌లో ప్రగతి బాట ఏది.?

9 Aug, 2019 12:50 IST|Sakshi
జ్వరంతో బాధపడుతున్న బాధితురాలిని మోసుకెళ్తున్న ఆదివాసీలు

ఊసేలేని ఉట్నూర్‌లో జిల్లా ప్రధాన ఆస్పత్రి ఏర్పాటు 

రిమ్స్‌లో ఐటీడీఏ వార్డు ఎత్తివేత

గతంలో చేజారిన గిరిజన యూనివర్సిటీ

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. ఈ సందర్భంగా వేడుకలు నిర్వహించుకోవ డం.. ఆదివాసీల కోసం ఇది చేస్తాం.. అది చేస్తామని హామీలివ్వడం ప్రజాప్రతినిధులకు, అధికారులకు పరిపాటే.. చివరికొచ్చి ప్రగతి బాటకు ఎదురుచూపే మిగులు తోంది. చేతికొచ్చిన వాటిని అమలుపర్చిన ఆదివాసీలకు మేలు జరుగుతుంది. ఉన్నవాటిని ఉంచిన వారికి లాభం చేకూరుతుం ది. ఆదివాసీలు అందరిని అక్కున చేర్చుకుం టారని, అమాయక జనాలను వల్లే వేసే అధి కార యంత్రాంగం జిల్లాలో వారి సంక్షేమాని కి మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
జిల్లా ప్రధానాస్పత్రి ఏదీ.?
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2008 కంటే ముందు ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంగా జిల్లా ప్రధాన ఆస్పత్రి ఏపీవీవీపీ ఆధీనంలో పనిచేసింది. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గిరిజనులకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం ఆదిలాబాద్‌లో రిమ్స్‌ వైద్య కళాశాల ఏర్పాటు చేశారు. జిల్లా ప్రధాన ఆస్పత్రి రిమ్స్‌గా మారిపోయి సుమారు 11 ఏళ్లు అవుతుంది. అప్పట్లోనే జిల్లా ప్రధాన ఆస్పత్రిని ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల, లేని పక్షంలో ఉట్నూర్‌ తరలిస్తామని చెప్పారు. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. మంచిర్యాల కొత్త జిల్లా కావడంతో ఇక అక్కడి ఏరియా ఆస్పత్రే జిల్లా ప్రధాన ఆస్పత్రిగా మారిపోయింది. ఆదిలాబాద్‌ జిల్లా ప్రధాన ఆస్పత్రి ఉట్నూర్‌లో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఏళ్లుగా నానుతూనే ఉంది. ఉట్నూర్‌ ఆస్పత్రిలో పడకల సామర్థ్యం పెంచి జిల్లా ప్రధాన ఆస్పత్రిగా దానిని రూపాంతరం చేసిన పక్షంలో ఆదివాసీలకు సమీపంలోనే మెరుగైన వైద్యం లభించే పరిస్థితి ఉంటుంది.

వైద్య పోస్టులు, ఏఎన్‌ఎంల పోస్టులు అనేకంగా ఖాళీగా ఉన్నాయి.  ఇక ఆదిలాబాద్‌ రిమ్స్‌లో గతంలో ఐటీడీఏ పీఓగా పనిచేసిన ఆర్‌వి కర్ణన్‌ ఐటీడీఏ వార్డును ఏర్పాటు చేశారు. ప్రధానంగా రిమ్స్‌లో వైద్యసేవల కోసం గిరిజనులు అధికంగా రావడం జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రత్యేక వార్డులను అప్పట్లో దూరదృష్టితో ఆలోచించి అప్పటి ఐటీడీఏ పీఓ ఏర్పాటు చేశారు. ఆ వార్డులో ఆదివాసీల కోసం అన్ని ప్రత్యేకంగా ఉండేవి. ఇప్పుడు ఆ వార్డునే తొలగించారు. ఆ వార్డును ఎందుకు తొలగించారనేది కూడా ఆస్పత్రిలో చెప్పేవారే లేరు. ఈ పరిస్థితుల్లో వారికి సరైన వైద్య చికిత్స ఎలా అందుతుందనేదే ప్రశ్న. మరోపక్క రక్తహీనతతో సతమతమయ్యే ఆదివాసీలకు ఆదిలాబాద్, ఉట్నూర్‌లలో బ్లడ్‌ బ్యాంకుల్లో సత్వరం రక్తం లభించేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపైనే ఉంది. సీజనల్‌ వ్యాధుల సమయంలో సరైన వైద్య చికిత్స లభిస్తే వారికి ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండదు.

విద్యపరంగా ప్రతిపాదనలు...
గిరిజనులకు విద్య అవకాశాల పరంగా ప్రభుత్వం అనేక ప్రతిపాదనలు చేసినప్పటికి మోక్షం రూపం దాల్చడం లేదు. ప్రాథమిక పాఠశాలలను దిశా మోడల్‌ స్కూల్‌ పథకంలో భాగంగా ఇంగ్లిష్‌ మీడియంగా ఆ స్కూళ్లను మార్చాలనే ప్రతిపాదన పూర్తిస్థాయిలో మోక్షం లభించడంలేదు. టీటీసీ, ఏఎన్‌ఎం శిక్షణ కేంద్రాలను ఏజెన్సీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంను పరిచయం చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఉన్నత చదువులు చదివే గిరిజనుల కోసం సరైన కోచింగ్‌ సెంటర్లు జిల్లాలో అందుబాటులో లేవు. ఇంటర్మీడియెట్‌కు సంబంధించి కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుకొనే పరిస్థితులు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వారికి చదువుల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే దూరదృష్టిలో వ్యవహరించాల్సిన పరిస్థితి. గతంలో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌కు మంజూరైన గిరిజన యూనివర్సిటీని ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులు తన్నుకపోయారు.

అధ్వానంగా రోడ్లు...
ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి దురావస్థతే. ఒకవైపు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం మూడేళ్లుగా నిర్వహించకపోవడంతో గిరిజనుల అభివృద్ధికి సరైన ప్రణాళికలు లేవు. ఒకవేళ నిధులు మంజూరు జరిగినా అవి పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చడంలేదు. 2017–18లో రూ.97 కోట్లతో ఏజెన్సీ మండలాల్లో పలుచోట్ల 57 రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అవి ఇప్పటికీ టెండర్‌ దశలోనే ఉండడం గమనార్హం. ఒకవైపు సరైన రోడ్డు మార్గాలు లేక భారీ వర్షాల కారణంగా ఆదివాసీలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మరోపక్క రూ.25 కోట్లతో ఐటీడీఏ పరిధిలోని ఆరు మండలాల్లో రెసిడెన్షియల్‌ స్కూళ్లను నిర్మిస్తున్నారు. ఈ నిధులు గిరిజనసంక్షేమ శాఖ నుంచి మంజూరయ్యాయి.
 

మరిన్ని వార్తలు