గిరి గ్రామాల్లో నీటి గోస

7 May, 2018 12:10 IST|Sakshi
జామ్మిలో చేతిపంపు వద్ద బిందెలతో ఎదురుచూపులు

జైనథ్‌ : మండలంలోని గిరిజన గ్రామం జామ్ని పంచాయతీ, అనుబంధ గ్రామం దత్తగూడలో చేతి పంపులు ఎండిపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులుపడుతున్నారు. ఈ రెండు గ్రామాల్లో ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా నీటికటకట మొదలైంది. దీంతో చేతిపంపుల వద్ద గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఓ గంట సేపు చేతిపంపులు వాడితే మరల గంట, రెండు గంటల వరకు నీళ్లు రాకపోవడంతో పనులు మానుకొని నీళ్లకోసం వేచి చూడాల్సిన దుస్థితి. దీంతో ప్రజలు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి, బిందెలతో లైన్లు కడుతున్నారు.

ఉన్నవి 14... పని చేస్తున్నవి 4.

 జామ్ని గ్రామంలో 235 కుటుంబాలు, 1350 జనాభా వుంది. ఈ గ్రామంలో మొత్తం 14 చేతి పంపులు ఉన్నాయి.  ప్రస్తుతం ఎండలకు కేవలం నాలుగు మాత్రమే పని చేస్తున్నాయి. అందులో ఒకటి గ్రామంలోని ఓహెచ్‌ఎస్‌ఆర్‌ నింపే వనరు బోరు కాగా, మిగిలినవి మూడు చేతి పంపులు ఉన్నాయి. పొచ్చమ్మ ఆలయం, పైకు ఇల్లు, జుగ్నక్‌ మోపత్‌ ఇండ్ల సమీంలోని మూడు చేతి  పంపులు మాత్రమే పని చేస్తుండడంతో ప్రజలు నీళ్లకోసం బిందెలతో క్యూకడుతున్నారు. ఇవి కూడా  గంట, రెండు గంటలు మాత్రమే పని చేస్తుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

 సగం గ్రామానికే ఓహెచ్‌ఎస్‌ఆర్‌

 వాస్తవంగా జామ్ని గ్రామంలో ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ప్రస్తుతం పని చేస్తుంది. దాని సోర్స్‌ బాగానే ఉంది. కాకపోతే ఈ ట్యాంకు నీళ్లు కేవలం సగం గ్రామానికి మాత్రమే సరిపోతున్నాయి. మిగిలిన వాళ్లకు నీళ్లు రాకపోవడంతో దిక్కు లేని పరిస్థితుల్లో ఊరి బయట ఉన్న బావిని ఆశ్రయిస్తున్నారు. ఎడ్లబండిపై డ్రమ్ములతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. బావి నీళ్లతో రోగాలు వ్యాపించే అవకాశం ఉందని తెలిసిన కూడ గత్యంతరం లేక వాటిని తాగుతున్నారు.

 దత్తగూడలో ఒకేఒక చేతిపంపు..

 జామ్ని అనుబంధ గ్రామం దత్తగూడ 52 ఇళ్లు 280మంది జనాభా ఉంది. ఈ గ్రామంలో సైతం తాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో ఓక బోర్, ఒక చేతి పంపు ఉంది. కరెంట్‌ ఉన్నప్పుడు ఓ గంట సేపు మాత్రమే బోర్‌లో నీళ్లు వస్తుండడం, చేతి పంపు వద్ద అంతంత మాత్రంగానే నీళ్ల ఉండడంతో ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కుంటున్నారు. ఎడ్లబండితో బావి నీళ్లను తెచ్చుకుంటూ, తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. దీంతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా నీళ్ల కోసం చేతిపంపుల వద్ద, బావి వద్ద క్యూకడుతున్నారు. కాగా గ్రామ పంచాయతీ ని«ధులతో గ్రామంలో ట్యాంకర్‌ ఏర్పాటు చేసినప్పటికి కూడా ప్రజలకు సరిపడా నీళ్లు అందించలేకపోతున్నామని సర్పంచ్‌ పెందూర్‌ మోహన్‌ చెబుతున్నాడు.

ఎడ్లబండితో తెచ్చుకుంటున్నాం

 ఊళ్లో నీళ్లు దొరకడం లేదు. ఎడ్లబండి కట్టుకొని, డ్రమ్ములతో బావి నీళ్లను తెచ్చుకుంటున్నాం. బావి ఊరికి బయట ఉండడంతో ఎడ్లకు కూడా ఇబ్బందిగా ఉంది. బావి వద్ద కూడా లైన్‌ ఉంటుంది. డ్రమ్ముల్లో తెచ్చిన నీళ్లను తాగునీటికి కూడా వాడాల్సి వస్తున్నదని. రోజు పొద్దున పనిగట్టుకొని నీళ్ల కోసం వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు ఇకనైన దయచూపాలి.

ట్యాంకులు ఏర్పాటు చేస్తాం

జామ్ని, దత్తగూడ గ్రామాల్లో ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు రెండు సింటెక్స్‌ ట్యాంకులు ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించం జరిగింది. ట్యాం కులు కూడా తెప్పించాం. గ్రామంలోని నీటి సోర్స్‌లకు కనెక్షన్‌ ఇచ్చి ట్యాంకులను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే ఏర్పాటు చేసి, నీటి వసతి కల్పిస్తాం.

మరిన్ని వార్తలు