యువతకు ‘వైటీసీ’ వెలుగులు!

26 Dec, 2017 02:55 IST|Sakshi

అడవి బిడ్డల కోసం గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త కార్యక్రమం

నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా యువజన శిక్షణ కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా 14 వైటీసీలు.. ఇప్పటికే 3,066 మందికి శిక్షణ

అందులో 1,073 మందికి పలు కంపెనీల్లో ఉద్యోగం

త్వరలో మరో 6 వైటీసీలు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని యువకులు మహానగరంలో కొలువులతో వికసిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త ప్రణాళికతో ఏజెన్సీ యువత జీవితంలో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు గిరిజన సంక్షేమ శాఖ యువజన శిక్షణ కేంద్రాల (వైటీసీ)ను ఏర్పాటు చేసింది.

ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏల పరిధిలో 14 యూత్‌ ట్రైనింగ్‌ కేంద్రాలను గత డిసెంబర్‌లో తెరిచింది. ఒక్కో వైటీసీని 27 వేల చదరపు అడుగులతో ఉన్న పక్కా భవనాల్లో ఏర్పాటు చేసింది. ఉపాధి లక్ష్యంగా శిక్షణ ప్రారంభించింది. శిక్షణ ఇచ్చేందుకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ గుర్తింపు పొందడంతోపాటు అత్యుత్తమ రేటింగ్‌ ఉన్న సంస్థలను ఎంపిక చేసింది. వైటీసీల నిర్వహణ, శిక్షణకు సంబంధించి నిధులు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచే అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ బాధ్యతల్ని గిరిజన సంక్షేమ శాఖ పక్కాగా నిర్వహిస్తోంది.

ఫలించిన ప్రయోగం
యువజన శిక్షణ కేంద్రాల్లో స్వయం ఉపాధి కోర్సులతోపాటు కెరీర్‌ గైడెన్స్, కంప్యూటర్‌ ఫండమెంటల్స్, మొబైల్‌ రిపేరింగ్, ఎలక్ట్రీషియన్, బ్యూటీషియన్, సాఫ్ట్‌ స్కిల్స్, డ్రైవింగ్, సెక్యూరిటీ గార్డ్స్, ఫుడ్, బేవరేజెస్‌ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తోంది. ఈ క్రమంలో 3,066 మంది వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో ఇప్పటికే 1,073 మంది ఉద్యోగాలు పొందారు. మరో 1,029 మంది శిక్షణ పొందుతున్నారు. ఈ కేంద్రాల ద్వారా మంచి ఫలితాలు వస్తుండటంతో మరిన్ని కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. విద్యార్హతలు, మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి చర్యలు తీసుకోనుంది.


త్వరలో మరిన్ని కేంద్రాలు
వైటీసీలతో ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. మంచి ఫలితాలు వస్తుండటంతో మరిన్ని కేంద్రాలు తెరిచేలా ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతానికి ఆరు చోట్ల కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం పక్కా భవనాలు నిర్మిస్తున్నాం. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే వైటీసీలను నిర్వహిస్తున్నాం.
– ఎం.లక్ష్మిప్రసాద్, స్టేట్‌ మిషన్‌ మేనేజర్, ట్రైకార్‌


కుటుంబానికి ఆసరాగా నిలిచా..
నా చిన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ రోజూ కూలి పని చేస్తూ నన్ను, తమ్ముడ్ని పోషించింది. ఇంటర్‌ వరకు చదివి.. ఆర్థిక కారణాలతో పై చదువులకు వెళ్లలేకపోయా. వరంగల్‌లోని వైటీసీలో శిక్షణ తీసుకుంటే ఉద్యోగం వస్తుందని తెలియడంతో చేరా. ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ కోర్సులో శిక్షణ తీసుకున్నా. జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఉద్యోగం దక్కింది.  కుటుంబానికి ఆసరాగా నిలిచా. దీనికి కారణమైన గిరిజన సంక్షేమ శాఖకు కృతజ్ఞతలు.          – భూక్యా శిరీష, కేసముద్రం, మహబూబాబాద్‌ జిల్లా

మరిన్ని వార్తలు