నా భర్తను విడిచి పెట్టరూ !

9 Mar, 2015 07:34 IST|Sakshi
నా భర్తను విడిచి పెట్టరూ !

* మాకు మావోయిస్టులతో సంబంధం లేదు
* కన్నీళ్ళ పర్యంతమవుతున్న ఆదివాసీ యువతి

 
 చండ్రుగొండ : ‘బెదురు చూపులు ... ఏం జరిగిందో తెలియని అమాయకత్వం.. ఏం చేయాలో తెలియని దుస్థితి.. పోలీసు లు ఐదుగురిని తీసుకెళ్ళారు.. అందరూ వచ్చారు.. ఆమె భర్త రాలేదు. ఎప్పుడొస్తాడో తెలియదు..’ అరుునా తన భర్త వస్తాడని ఆశగా దారివైపే  ఎదురుచూస్తూ గడుపుతోంది నిండు గర్భిణి అయిన ఓ ఆదివాసీ యువతి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోలు, సల్వజుడుం, పోలీసులతో ఇబ్బందులు తట్టుకోలేక దశాబ్దకాలం క్రితం ఈ ప్రాంతానికి  వలస వచ్చిన ఆది వాసీల్లోని ఓ యువతి పడ్తున్న నరకయాతనపై కథనమిది.
 చండ్రుగొండ మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన బెండాలపాడు శివారు అటవీప్రాంతంలో ఆదివాసీ గూడెంకు చెందిన పొడియం జ్యోతి నివాసం ఉంటోంది.
 
  నిండా పదమూడేళ్లు కూడా లేని ఆ బాలిక ప్రస్తుతం నిండు గర్భిణి. జ్యోతి భర్త పొడియం దేవాతోపాటు మడకం కుమార్, మడకం దేవా, వేముల గంగా, ఎట్టి దేవాలను మావోల సానుభూతిపరులన్న పేరుతో స్పెషల్‌పార్టీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన వారిని పట్టుకెళ్ళారు. న్యూడెమోక్రసీ పార్టీ సబ్ డివిజన్ నాయకులు ఎస్కే ఉమర్ చొరవ, పౌరహక్కుల సంఘం నాయకులు పోలీస్‌శాఖ జిల్లా అధికారులపై తీసుకువచ్చిన ఒత్తిడితో నలుగురు యువకులను శనివారం విడిచిపెట్టారు. పొడియం దేవాపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని ఖమ్మం జైలుకు తరలించినట్లు సమాచారం.
 
 పోలీసులు పెట్టిన చిత్రహింసలు భరించలేక దేవా తను మావోయిస్టు పార్టీకి సానుభూతి పరున్ని అని అంగీకరించినట్లు అతని స్నేహితులు చెప్తున్నారు. జీవనం సాగించేందుకు ఛత్తీస్‌గఢ్ నుండి ఈ ప్రాంతానికి వలస వచ్చామని అయితే ఇక్కడ తిప్పలు తప్పడం లేదని ఆదివాసీలు అంటున్నారు. రెక్కల కష్టంతో పూట గడుస్తోంది. మాకు మావోయిస్టు పార్టీతో సంబంధంలేదు. విచారణ జరిపి సత్వరమే తన భర్తను వదిలిపెట్టాలని జిల్లా కలెక్టర్, ఐటిడీఏ పీఓలను పొడియం దేవా భార్య జ్యోతి ప్రాధేయపడుతోంది.
 

>
మరిన్ని వార్తలు