గర్జించిన గిరిజనులు

20 Jul, 2014 02:15 IST|Sakshi
గర్జించిన గిరిజనులు

భద్రాచలం, కొత్తగూడెం డీఎఫ్‌ఓ కార్యాలయాల ఎదుట ధర్నా

 అటవీ అధికారుల దాడులకు వ్యతిరేకంగా గిరిజనులు గర్జించారు. భద్రాచలం, కొత్తగూడెం డీఎఫ్‌ఓ కార్యాలయాల ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. తాము పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాచలంలో వ్యవసాయ కార్మిక సంఘం, కొత్తగూడెంలో రైతు కూలీ సంఘం, సీపీఐ వేర్వేరుగా నిర్వహించిన ఈ కార్యక్రమాలలో గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన భద్రాచలంలో...
భద్రాచలం టౌన్: పోడు భూములు సాగు చేసుకుంటు న్న గిరిజనులపై అటవీ అధికారుల దాడులకు వ్యతిరేకంగా, అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూమి సాగుదారులకు పట్టాలు ఇవ్వాలన్న డిమాండుతో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక డీఎఫ్‌వో కార్యాలయం ఎదుట శనివారం గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ... రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’గా తీర్చిదిద్దుతామంటూ ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, గిరిజనులపై అటవీ అధికారుల దాడులను ఆపాలని డిమాండ్ చేశారు.
 
పోడు సాగుదారులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలివ్వాలని కోరారు. గిరిజనులపై దాడులను ఆపుతామంటూ డీఎఫ్‌వో స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు కదిలేది ధర్నా విరమించేది లేదని ప్రకటించారు. ధర్నా వద్దకు డీఎఫ్‌వో వచ్చి ఎమ్మెల్యే రాజయ్యతో మాట్లాడారు. అటవీ భూముల్లో చట్ట ప్రకారంగా ఉన్న వారిని కదిలించబోమని, గిరిజనులపట్ల అధికారులు దురుసుగా వ్యవహరించకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘‘గిరిజనులపై దాడులను ఆపకపోతే మరో మన్యం తిరుగుబాటు తప్పదు’’ అని, అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. ధర్నాలో సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.వెంకట్, జిల్లా నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, మర్లపాటి నాగేశ్వరరావు, గడ్డం స్వామి, వెంకటేశ్వర్లు,  మాధవరావు, ఐవీ పాల్గొన్నారు.

సీపీఐ ఆధ్వర్యాన కొత్తగూడెంలో...
కొత్తగూడెం రూరల్: చండ్రుగొండ మండలంలోని పలు గ్రామాల్లో గత 12 సంవత్సరాలుగా పోడు సాగు చేస్తున్న గిరిజన రైతులపై అటవీ శాఖ అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా కొత్తగూడెం డీఎఫ్‌వో కార్యాలయం ఎదుట గిరిజనులు సీపీఐ ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ.. పోడు చేసుకుని జీవిస్తున్న గిరిజనులను వారి భూముల్లోకి వెళ్లకుండా అటవీ అధికారులు అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. ‘‘వారికి పోడు భూములే జీవనాధారం. వాటినిలాక్కుంటే మిగిలేది ఆకలి చావులే’’ అని, ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఐటీసీ, బీపీఎల్ వంటి ప్రైవేటు సంస్థలకు వేల ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూములు కట్టబెడుతున్న ప్రభుత్వం... నిరుపేద గిరిజనుల జీవనోపాధికి పోడు భూములు ఇచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తోందని ప్రశ్నించారు. భూమి లేని వారికి మూడు ఎకరాలు ఇస్తామంటున్న పాలకులు.. గిరిజనుల పోడు భూములను లాక్కోవటంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు. పోడు సాగుదారులపై వేధింపులు ఆపకపోతే వారం రోజుల్లో డీఎఫ్‌వో కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అనంతరం, డీఎఫ్‌వోకు నాయకులు వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో నాయకులు సలిగంటి శ్రీనివాస్, బండి విజయభాస్కర్, కంచర్ల జమలయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు