వలసబాటలో కొలాం గిరిజనులు

30 Nov, 2018 14:28 IST|Sakshi
జనాలు లేక వెలవెలబోతున్న ఇళ్లు

పంటలు నష్టపోయి..  

‘ఉపాధి’ లేక..మహారాష్ట్రలో కూలీ పనులు

ఇంద్రవెల్లి(ఖానాపూర్‌): భారీ వర్షాలకు పంటలు నష్టపోయి.. ఆశించిన దిగుబడి రాక.. సొంత గ్రామంలో ఉపాధి అవకాశాలు కరువై కొలాం గిరిజన కుటుంబాలు వలస బాట పట్టాయి. మహారాష్ట్రలో కూలీ పనులు వెదుక్కుంటూ వెళ్లాయి. మండలంలోని సమాక గ్రామ పంచాయతీ పరిధి పాటగూడ(కే)లో 55 కొలాం గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సుమారు 300 మంది జనాభా ఉండగా.. 160 మంది ఓటర్లు ఉన్నారు. అందరూ చిన్న, సన్నకారు రైతులే.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ జూన్, జూలై, ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు రైతులు సాగు చేసిన పత్తి, జొన్న, సోయా ఇతర పంటలు నష్టపోయారు. మిగిలిన పంటలు ఎదుగుదల దశలో మళ్లీ వర్షాలు లేక నష్టం వాటిల్లింది.
పెట్టుబడిలో సగం కూడా వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు స్వగ్రామంలో ఉపాధి అవకాశాలు లేక కొందరు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఉపాధి హామీ పథకం పనులు కల్పించాల్సిన అధికారులు గ్రామాన్ని సందర్శించడం లేదు. దీంతో 20 రోజుల క్రితం గ్రామానికి చెందిన ఆత్రం లేతు, కుంరం లేతు, ఆత్రం లక్షామ, టెంక సీతారాం, కొడప ముత్తు, కొడప రాము తమ పిల్లలను బంధువుల ఇళ్లలో వదిలి మహారాష్ట్రలోని నాందేడ్‌ గ్రామానికి వలస వెళ్లి కూలీ పనులు చేస్తున్నారు. 

కనిపించని ‘ఉపాధి’ పనులు..
కరువును నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించింది. నిరుపేద కుటుంబాలు, కూలీలకు 100 రోజల పని దినాలు కల్పించాలని ప్రకటించింది. ప్రస్తుతం 150 రోజులపాటు ఉపాధి పనులు కల్పించాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండలంలోని పాటగూడ(కే) కొలాం గిరిజన గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి ఉపాధి పనులు కల్పించలేదు. మరికొన్ని కుటుంబాలు కూడా వలస వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయని గ్రామపెద్దలు తెలిపారు. అధికారులు దృష్టి సారించి గ్రామంలో ఉపాధి పనులు కల్పించాలని కోరుతున్నారు.


 

మరిన్ని వార్తలు