తీజ్ ఆన్‌పడిఓచ్..

1 Aug, 2014 03:31 IST|Sakshi
తీజ్ ఆన్‌పడిఓచ్..

 కాలం మారుతున్నా.. అనాదిగా వస్తున్న తమ ఆచార వ్యవహారాలను మాత్రం గిరిజనులు వీడడం లేదు. సంప్రదాయ పండగలు, జాతరలు, ఉత్సవాలు నిర్వహిస్తూ తమ సంసృ్కతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. అలాంటి ఉత్సవాల్లో తీజ్ (మొలకల) పండగ ఒకటి. శ్రావణమాసంతో ప్రారంభమయ్యే తీజ్ ఉత్సవాలు ఇప్పటికే తండాల్లో మొదలయ్యాయి. పండగ జరిగే తొమ్మిది రోజులు తండాల్లోని గిరిజన యువతులు ఆడిపాడతారు. గురువారం చందంపేట మండలం తెల్దేవర్‌పల్లిలో కూడా తీజ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పండగ విశేషాలు, విశిష్టతలను గుర్తు చేసుకుందాం.
 
 తీజ్ పండగొచ్చింది(ఆన్‌పడిఓచ్).. తండాల్లో సంబరాలు నింపింది. లంబాడీలు ఘనంగా నిర్వహించే పండగల్లో తీజ్ ఒకటి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండగకు బతకుదెరువ ు కోసం, ఇతర పనుల కోసం, ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారు కూడా తమ స్వస్థలాలకు వస్తారు. పంటలు బాగా పండాలని, పెళ్లికాని యువతులకు వివాహాలు జరగాలని, మంచి భర్తలు దొరకాలని గిరిజన కుటుం బాలు తమ ఇష్టదైవమైన మేరమ్మను కొలుస్తూ ప్రతిఏటా శ్రావణమాసంలో తీజ్ జరుపుకుంటారు. కాలక్రమంలో సమాజంలో, గిరిజనుల్లో మార్పులు చోటు చేసుకున్నా తీజ్ విషయంలో మాత్రం వారు ఆనాటి సంప్రదాయాన్నే పాటిస్తుండటం విశేషం. ప్రధానంగా పెళ్లీడుకొచ్చిన యువతులకు ఈ పండగ ప్రత్యేకం.
 
 మంచి జరుగుతుందని..
 గిరిజనుల ఆరాధ్యదైవమైన శీతల భవానీలు(ఏడుగురు దేవతలు) మేరమ్మతల్లి, తుల్జాభవానీ, ద్వాళంగర్ అమ్మవారు, పెద్దమ్మతల్లి, ముత్యాలమ్మతల్లి, ఎల్లమ్మ తల్లి దేవతలను తలుచుకుంటూ ఈ తీజ్ పండగను నిర్వహిస్తుంటారు. దీంతో తండాకు ఎలాంటి కీడు రాదని, మంచి జరుగుతుందని గిరిజనుల నమ్మకం. అదే విధంగా పెళ్లి కాని యువతులు మాత్రమే ఈ పండగను నిర్వహించడం వల్ల వారికి మంచి గుణగణాలు కల్గిన భర్తలు దొరుకుతారనేది వారి విశ్వాసం. వర్షాలు కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని కూడా నమ్ముతారు. తీజ్ పండగకు వారి ఆర్థిక స్థోమతను బట్టి గిరిజన యువతులకు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అంతేగాక ఇంటి ఆడపడుచులు ఇళ్లకు రావడంతో తండాల్లో సందడి నెలకొంటుంది.
 
 ప్రత్యేక పూజలు
 ప్రతిరోజు యువతులు స్నానమాచరించి ఆగరబత్తులతో తీజ్ బుట్టలకు మూడు సార్లు పూజలు చేస్తారు. అంతేగాక ప్రతిరోజు వారివారి బుట్టలలో నీళ్లు పోసి, కొబ్బరికాయలు కొట్టిమొక్కులు చెల్లిస్తారు. ఇలా ఎమిదవరోజు డంబోలి పండగను నిర్వహిస్తారు. ఆ రోజున ప్రతి ఇంటి నుంచి పూజారి బియ్యం, బెల్లం సేకరించి తీజ్ బుట్టలు ఏర్పాటు చేసిన చోట అన్నింటినీ కలిపి పాయసం తయారుచేస్తాడు. అంతేగాక తండా నుంచి గొర్రె పొట్టేళ్లను ఒకేచోట కోసి ప్రతి ఇంటికి ఆ మాంసాన్ని భాగాలుగా చేసి పంపిస్తారు. పాయసాన్ని ముద్దలుగా చేసి ప్రతి ఇంటికి అంద జేస్తారు. 9వ రోజు సాయంత్రం పందిరిపై నుంచి బుట్టలను తీసి కింద ఉంచి వాటి చుట్టూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతారు. అదేవిధంగా తండాకు చెందిన పురుషులు తీజ్ బుట్టల వద్ద వరుసగా కూర్చుంటారు. అనంతరం యువతులు పెరిగిన గోధుమ గడ్డిని తెంచి పురుషుల తలలు, చెవులలో పెడతారు. అనంతరం ఆ బుట్టలను చెరువులో నిమజ్జనం చేసి అక్కడే సోదరుని వరుసయ్యే పురుషులు యువతుల కాళ్లను కడిగి వారిని ఇళ్లలో చేసుకొచ్చిన పంటలను(కేత్) తినిపించడం ఆనవాయితీ. పురుషులపై వేసిన ఆకులను ఇంటికి తీసుకెళ్లి దేవుని వద్ద భద్రపరుస్తారు. రోజూ వాటికి పూజలు చేస్తుంటారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు