ట్రిబ్యునల్ తీర్పు.. కొత్త సచివాలయం

21 Oct, 2016 02:12 IST|Sakshi
ట్రిబ్యునల్ తీర్పు.. కొత్త సచివాలయం

నేటి మంత్రివర్గ సమావేశంలో ఈ రెండు అంశాలపైనే ప్రధాన చర్చ
ట్రిబ్యునల్ తీర్పుపై నీటిపారుదల అధికారులతో హరీశ్‌రావు సమీక్ష

 సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు.. కొత్త సచివాలయం నిర్మాణం.. ఈ రెండు అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం నేడు ప్రత్యేకంగా సమావేశమవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రంపై పడే ప్రభావం, భవిష్యత్ కార్యాచరణతో పాటు మొత్తం పది అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకే విచారణ పరిమితమైతే తెలంగాణకు ఎనలేని నష్టం జరిగే అవకాశాలున్నాయి.

దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. తీర్పు వెలువడినందున ఇప్పటికిప్పుడు సుప్రీంకి వెళ్లినా ఇంతకు మించి చేసేదేమీ ఉండదనే వాదనను సైతం ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. రాష్ట్రానికి న్యాయం చేసే ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోరాదని, ఈ కేసులో ఏపీని కలుపుకుని సుప్రీంకోర్టుకు వెళ్లాలని రిటైర్డ్ ఇంజనీర్లు ప్రభుత్వానికి సూచించారు. ముఖ్యంగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు అదనంగా కేటాయించిన 254 టీఎంసీలను ఆ రాష్ట్రాలు వాడుకుంటే దిగువకు నీరొచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

అదే జరిగితే రాష్ట్రంలో ఖరీఫ్ ఆశలు పూర్తిగా వదులుకోవడమో లేక అక్టోబర్ వరకు ఆగడమో చేయాల్సిందేనని, ఇది రాష్ట్రానికి గొడ్డలిపెట్టేనని అంటున్నారు. రెండు రాష్ట్రాలకే ఈ వాదనలు పరిమితమైతే తెలంగాణ కేవలం క్యారీ ఓవర్ కింద ఇచ్చిన 150 టీఎంసీలు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అందులో వచ్చే వాటాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కొత్తగా ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల అవసరాలకు ఈ వాటాలు ఎంతమాత్రం సరిపోవు. అందుకే సుప్రీంను ఆశ్రయించి స్టే కోరాలనే వాదనలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ ముఖ్యమంత్రి కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.

మరోవైపు ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు గురువారం సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ట్రిబ్యునల్ తీర్పు, కేంద్ర ప్రభుత్వ పాత్ర, తదుపరి అనుసరించాల్సిన ప్రత్యామ్నాయాలు, సుప్రీంలో ఇప్పటికే దాఖలై ఉన్న స్పెషల్ లీవ్ పిటిషన్‌ల పురోగతిని సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రిని కలసి ఆ వివరాలన్నింటినీ అందించారు.

వచ్చే నెలలోనే కూల్చివేత..!
ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి.. అదే ప్రాంగణంలో కొత్త సచివాలయం నిర్మించే అంశాన్ని కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. ఇందులో ఉన్న తమ సచివాలయ ప్రాంగణాన్ని తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా అంగీకరించింది. కానీ విభజనకు సంబంధించిన అంశం కావటంతో ఏపీ సచివాలయం స్వాధీనం, మొత్తం సచివాలయంలోని అన్ని భవనాల కూల్చివేతపై మంత్రివర్గంలో చర్చించి తీర్మానం చేయనున్నారు. అదే తీర్మానాన్ని గవర్నర్ ఆమోదానికి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలోనే కూల్చివేత పనులు ప్రారంభించే అవకాశాలున్నాయి.

అందుకు వీలుగా సచివాలయంలోని ఆఫీసులన్నీ తాత్కాలికంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న భవనాల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన ఆఫీసులను సమీపంలోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌కు తరలించాలని, ఏపీ ప్రభుత్వానికి నాంపల్లిలో గాంధీభవన్ పక్కన ఉన్న మనోరంజన్ బిల్డింగ్‌ను అప్పగించాలని నిర్ణయించారు. కేబినెట్ సమావేశం నేపథ్యంలో గురువారం సీఎస్ ఈ రెండు భవనాలను పరిశీలించారు.

మరిన్ని వార్తలు