ఎన్నికల పిటిషన్ల పరిష్కారానికి ట్రిబ్యునళ్లు

30 Jan, 2019 02:58 IST|Sakshi

పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఏర్పాటు 

నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌:గ్రామపంచాయతీ, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్‌ ఎన్నికలకు సంబంధించి తలెత్తే ఎలాంటి వివాదాలనైనా ఇకపై ఎన్నికల ట్రిబ్యునళ్లు పరిష్కరించనున్నాయి. ఈ మేరకు కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఎన్నికల ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీచేశారు. వివిధ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతోపాటు ఇతరు లు ఎవరైనా వీటి ముందు పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చు.

గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆ పంచాయతీ పరిధిలోకి వచ్చే జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్నికల ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు. మండల, జిల్లాపరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్నికల ట్రిబ్యునల్‌గా విచారణ జరుపుతారు. అలాగే గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారి లేదా అధికారులు కూడా ఎన్నికల ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు.
 
30 రోజుల్లోగా పిటిషన్‌... 
గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజాపరిషత్‌ ఎన్నికల ఫలితాలను ప్రకటించిన రోజు నుంచి 30 రోజులలోపు పిటిషన్‌ దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 30వ రోజున ట్రిబ్యునల్‌ తెరచి లేనిపక్షంలో ఆ మరుసటిరోజు పిటిషన్‌ వేసుకోవచ్చు. పిటిషనర్లు తాము చేస్తున్న ఆరోపణలకు పూర్తి ఆధారాలను దరఖాస్తుతోపాటు జతచేయాల్సి ఉంటుంది. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీపీసీ) ప్రకారం పిటిషన్‌ దాఖలు చేయాలి. పిటిషన్‌తోపాటు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.1,000 జమ చేయాలి. ఈ నిబంధనలకు అనుగుణంగా లేని పిటిషన్లను ట్రిబ్యునల్‌ తిరస్కరించొచ్చు. పిటిషన్‌ కాపీలను ప్రతివాదికి అందజేయడంతోపాటు ట్రిబ్యునల్‌ నోటీస్‌ బోర్డులో అతికించాలి. తన ఎదుట దాఖలైన పిటిషన్లపై సీపీసీ నిబంధనల్లో నిర్దేశించిన కాలపరిమితి మేరకు ట్రిబ్యునల్‌ విచారణ జరపాల్సి ఉంటుంది. సాక్షుల విచారణకు, ఆధారాల స్వీకరణకు ట్రిబ్యునల్‌కు అధికారం ఉంటుంది.

సాక్షులు తాము ఎన్నికల్లో ఎవరికి ఓటేశామో తెలియజేయాల్సిన అవసరంలేదు. ట్రిబ్యునల్‌ అనుమతి లేకుండా ఎన్నికల పిటిషన్లను ఉపసంహరించుకునే అవకాశం లేదు. పిటిషనర్లు ఒకరి కంటే ఎక్కువగా ఉంటే వారందరి అనుమ తితో పిటిషన్‌ను ఉపసంహరించుకోవచ్చు. ఉపసంహరణకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇతర పార్టీలకు నోటీసు జారీచేసి విచారణ తేదీని నిర్ణయించాల్సి ఉంటుంది. ఏదైనా పిటి షన్‌ ఉపసంహరణకు అనుమతినిచ్చినప్పుడు ట్రిబ్యునల్‌ ఆ నిర్ణయాన్ని సంబంధిత గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజాపరిషత్‌ అధికారులకు తెలియజేయాలి.

ట్రిబ్యునళ్ల విధులు, అధికారాలివీ..

►పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులు, పిటిషన్లను ఈ ట్రిబ్యునళ్లు పరిష్కరిస్తాయి.  

►ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి, అతడు/ఆమె ఏజెంటు, అతడు/ఆమె ఆమోదం పొందిన ఏ వ్యక్తి అయినా అక్రమాలకు పాల్పడినట్టు తేలితే.. వారి ఎన్నికను రద్దు చేయడమే కాకుండా ఆరేళ్లపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయకుండా ట్రిబ్యునల్‌ ఆదేశించవచ్చు. సదరు వ్యక్తిని అంతే కాలానికి ఓటేయడానికి వీలు లేదని ఆదేశించే అధికారం కూడా ట్రిబ్యునల్‌కు ఉంది. 

►గెలుపొందిన వ్యక్తి ఎన్నిక చెల్లదని ట్రిబ్యునల్‌ తీర్పు ఇచ్చిన పక్షంలో ఆ పిటిషన్‌ దాఖలు చేసిన వ్యక్తి లేదా వ్యక్తుల్లో అర్హులైనవారిని గెలుపొందినట్టుగా ప్రకటించవచ్చు లేదా మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు జారీచేయొచ్చు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా