విజయ నిర్మలకు ఘన నివాళి

28 Jun, 2019 04:05 IST|Sakshi
భార్య భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్న కృష్ణ. చిత్రంలో ఆదిశేషగిరిరావు, మహేశ్‌బాబు, నరేష్‌ తదితరులు

చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన అలనాటి మేటి నటి 

నివాళులు అర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు 

కన్నీటి పర్యంతమైన సూపర్‌ స్టార్‌ కృష్ణ

నేడు చిలుకూరు ఫాంహౌస్‌లో అంత్యక్రియలు 

హైదరాబాద్‌/మొయినాబాద్‌(చేవెళ్ల): అలనాటి మేటి నటి, ప్రముఖ దర్శకురాలు విజయ నిర్మలకు చిత్ర పరిశ్రమతోపాటు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి 12.40 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. గురువారం ఉదయం 11.40 గంటలకు పార్థివదేహాన్ని నానక్‌రాంగూడలోని ఆమె నివాసానికి తీసుకొచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయ నిర్మలకు కన్నీటి వీడ్కోలు పలికారు. చిరంజీవి, మోహన్‌బాబు, పవన్‌ కల్యాణ్, రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, మంచు విష్ణు, కోదండరాంరెడ్డి, సుబ్బరామిరెడ్డి, శ్రీకాంత్, దాసరి అరుణ్, కైకాల సత్యనారాయణ, రావు రమేష్, వంశీ పైడిపల్లి, తమ్మారెడ్డి భరద్వాజ్, చోటా కె నాయుడు, కోటి, సుధీర్‌బాబు, రాఘవేంద్రరావు, విజయశాంతి, చార్మి, మంచు లక్ష్మి, విజయచందర్, మండలి బుద్ధప్రసాద్‌ తదితరులు విజయ నిర్మల భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమె భర్త, సూపర్‌స్టార్‌ కృష్ణ, కుమారుడు నరేష్, మహేష్‌బాబు, నమ్రతలను ఓదార్చారు.  

పలువురు సంతాపం 
విజయ నిర్మల మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఆమె మరణం కళారంగానికి తీరని లోటు అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి తదితరులు విజయ నిర్మల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

కృష్ణను ఓదార్చిన కేసీఆర్‌
విజయ నిర్మల మరణవార్త తెలియడంతో సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతికి గురయ్యారు. నానక్‌రాంగూడలోని ఆమె నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు. కన్నీటిపర్యంతమైన కృష్ణను ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు కేశవరావు, సంతోష్‌రావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, రసమయి బాలకిషన్‌ ఉన్నారు. 

గురువారం విజయ నిర్మల పార్థివదేహం వద్ద విలపిస్తున్న కృష్ణను ఓదారుస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో కోట శ్రీనివాసరావు, జమున, గల్లా అరుణ తదితరులు

అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి 
అనారోగ్యంతో కన్నుమూసిన విజయ నిర్మల అంత్యక్రియలు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం చిలుకూరులో జరగనున్నాయి. చిలుకూరులో ఉన్న ఫాంహౌస్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నానక్‌రాంగూడ నుంచి విజయ నిర్మల అంతిమయాత్ర మొదలై మధ్యాహ్నం 12 గంటలకు చిలుకూరు ఫాంహౌస్‌కు చేరుకుంటుందని ఆమె బంధువులు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు