వేయిస్తంభాల దేవాలయానికి హృదయ్‌ నిధులు

3 Mar, 2017 09:57 IST|Sakshi
వేయిస్తంభాల దేవాలయానికి హృదయ్‌ నిధులు
కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధిశాఖ సెక్రటరీ త్రిపాఠి
► దేవాలయంలో విద్యుత్‌ అలంకరణ, గార్డెనింగ్‌ ఏర్పాటు చేయాలని సూచన
 
హన్మకొండ కల్చరల్‌ : కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధిశాఖ సెక్రెటరీ త్రిపాఠి, ఆనంద్, కలెక్టర్‌ అమ్రపాలి, కుడా వైస్‌ చైర్మన్‌ శృతిఓజా గురువారం సాయంత్రం చారిత్రాత్మక వేయిస్తంభాల దేవాలయాన్ని పరిశీలించారు. ఆలయంలో జరుగుతున్న కల్యాణ మండపం పునరుద్ధరణ పనులను, ఆలయం చుట్టూ ఉన్న ప్రదిక్షణా పరిక్రమను పరిశీలించారు. ఇంటాక్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు, దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారికి కల్యాణమండపం పునరుద్ధరణ నిర్మాణం జరుగుతున్న తీరును వివరించారు.
 
ఈ సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ.. దేవాలయం ఏడు వరుసలుగా నిర్మించిన గద్దెపై నిర్మించబడి ఉందని ప్రస్తుతం మూడు మాత్రమే కన్పిస్తున్నాయని అన్నారు. కాకతీయుల కాలంలో మాదిరిగా ఏడు వరుసల పరిక్రమాన్ని కన్పించేలా చేయాల్సిందన్నారు. అందుకుగానూ నాలుగు అడుగుల లోతు తవ్వి నేలను సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే హృదయ్‌ పథకం నిధులతో దేవాలయంలో విద్యుత్‌ అలంకరణ, గార్డెనింగ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారిని ఘనంగా స్వాగతించి పూజలు నిర్వహించి అనంతరం శేషవస్త్రాలతో సన్మానించారు. వారి వెంట అధికారులు అజిత్‌రెడ్డి, భీంరావ్, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పౌరసంబంధాలశాఖ డీడీ జగన్‌ ఉన్నారు. 
మరిన్ని వార్తలు