శివతేజరెడ్డి ఆత్మహత్యపై త్రిసభ్య కమిటీ

31 Mar, 2018 02:52 IST|Sakshi

నిమ్స్‌లోని అన్ని విభాగాల్లోనూ కమిటీ విచారణ

ఫ్యాకల్టీ వేధింపుల వల్లే శివతేజ ఆత్మహత్య

రెసిడెంట్‌ డాక్టర్స్‌ సహాఅతని తల్లి ఆరోపణ

ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్‌  

సాక్షి, హైదరాబాద్‌: నిమ్స్‌లో యువ వైద్యుడు శివతేజరెడ్డి ఆత్మహత్య ఘటనపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.రాజారెడ్డి, వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ బీఎస్‌వీ మంజుల నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ.. న్యూరోసర్జరీ సహా అన్ని విభాగాల్లోనూ విచారణ చేపట్టనుంది. సోమవారం ఆయా విభాగాల్లో పనిచేస్తున్న రెసిడెంట్లతో కమిటీ సమావేశమై.. రెసిడెంట్‌ వైద్యుల పట్ల ఫ్యాకల్టీ అనుసరిస్తున్న తీరు తదితర అంశాలపై చర్చించనుంది.

ఇదిలా ఉంటే తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, న్యూరోసర్జరీ విభాగం ఫ్యాకల్టీ వేధింపులే తమ కుమారుడి మృతికి కారణమని శివతేజరెడ్డి తల్లి కవిత ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని శుక్రవారం ఆమె నిమ్స్‌ డైరెక్టర్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని, లేదంటే న్యాయ పోరాటానికి వెనుకాడబోమని హెచ్చరించారు. శివతేజ మృతిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న రెసిడెంట్లతో కలసి శుక్రవారం ఆమె నిరసన తెలిపారు.

చిన్న తప్పు దొర్లితే చాలు..
ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు లేకపోవడంతో ఉన్నవాళ్లపై పనిభారం పెరుగుతోంది. ఇక ఆపరేషన్‌ థియేటర్లలో టేబుళ్లు, కుర్చీలు, గ్లౌజులు, మాస్కులే కాదు ఓటీలోకి వెళ్లేందుకు అవసరమైన డ్రెస్‌లు, చెప్పులు కూడా లేవు. పని ఒత్తిడి.. కనీస వసతులు లేకపోవడం.. కుటుంబ సభ్యులకు కనీస సమయం కేటాయించలేకపోతుండటంతో వైద్యులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. చికిత్సల్లో చిన్న తప్పు దొర్లినా సీనియర్ల నుంచి వేధింపులు తప్పడం లేదు. ఈ వేధింపులతో మనస్తాపం చెందే శివతేజరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆరోపిస్తోంది.

న్యూరోసర్జరీ విభాగంలోనే కాక.. అన్ని విభాగాల్లోనూ ఇదే దుస్థితి నెలకొందని పేర్కొంది. అయితే యువ వైద్యులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ఫ్యాకల్టీ వైద్యులు కృషి చేస్తున్నారని, రోగులు చనిపోయినప్పుడు సీనియర్‌ ఫ్యాకల్టీలు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఈ సమయం లో రెసిడెంట్లే కాదు ఆ విభాగం మొత్తం ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని ఫ్యాకల్టీ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. దీనికి మనస్తాపం చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.

మా వద్ద ఆధారాలు ఉన్నాయి
శివతేజను మానసికంగా ఇబ్బందులకు గురిచేసినట్లు మా వద్ద ఆధారాలున్నాయి. వాటిని కమిటీకి అప్పగిస్తాం. మీడియా సహా ఇతరులెవరిపైనా మాకు నమ్మకం లేదు. అందుకే ప్రస్తుతం వాటిని బయట పెట్టడం లేదు. ఒక్క న్యూరాలజీ విభాగంలోనే కాదు దాదాపు అన్ని విభాగాల్లోనూ వేధింపులు ఎదురవుతున్నాయి. భయంతో చెప్పడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.    
– డాక్టర్‌ శివానందరెడ్డి, రెసిడెంట్ల సంఘం అధ్యక్షుడు

వేధింపుల వల్లే ఆత్మహత్య..‘మీకు బిడ్డల్లేరా..? వైద్య విద్య కోసం
వచ్చిన నా బిడ్డను సూటిపోటి మాటలతో వేధించి చంపేస్తారా? న్యూరాలజీ ఫ్యాకల్టీకిది తగునా.. చదువు కోసం వచ్చిన వారిని ఆదరించాల్సింది పోయి.. తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తారా? ఫ్యాకల్టీతో పాటు ఎంఆర్‌ఐ టెక్నీషియన్లు కూడా నా బిడ్డను హేళన చేశారు. నాలాగా మరొకరికి పుత్రశోకం కలగకూడదనే న్యాయం పోరాటం చేస్తున్నాను.     
– శివతేజరెడ్డి తల్లి కవిత

మరిన్ని వార్తలు