ఎన్నిక ముందే ఖరారు

10 May, 2019 05:04 IST|Sakshi

జెడ్పీ చైర్‌పర్సన్లపై టీఆర్‌ఎస్‌ వ్యూహం

అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవులను గెలుచుకోవాలని టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని జెడ్పీలకు మినహా ఎక్కువ పదవులకు ఎన్నికకు ముందే అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 14తో ముగియనున్నాయి. మే 27న ఫలితాలు వెల్లడవుతాయి. అనంతరం ఎంపీపీ, జెడ్పీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికల తేదీని ప్రకటిస్తుంది. ఈ ఎన్నికకు ఒకట్రెండు రోజుల ముందే జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులను ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పటి వరకు పదవులు రాని వారు, కీలక నేతలు ఉన్న కొన్ని జెడ్పీలు మినహా అన్నింటికీ ఎన్నికల సమయంలోనే అభ్యర్థులను ప్రకటించనున్నారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ రిజర్వేషన్‌ కేటగిరీ ఆధారంగా జెడ్పీటీసీల్లో గెలిచిన వారిలో ఎవరిని ఎంపిక చేయాలనేది అప్పుడే నిర్ణయించనున్నారు. అన్ని జెడ్పీల్లో ముందుగానే చైర్‌పర్సన్‌ అభ్యర్థులను ప్రకటించడం వల్ల రాజకీయ పోటీ వాతావరణంతో సొంత పార్టీలోని జెడ్పీటీసీ అభ్యర్థులకు కొన్ని చోట్ల ఇబ్బందులు వస్తున్నట్లుగా టీఆర్‌ఎస్‌ అధిష్టానం గుర్తించింది. ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకు ఎన్నిక సమయంలోనే చైర్‌పర్సన్‌ అభ్యర్థులను ప్రకటించే వ్యూహాన్ని అమలు చేయనుంది. ఎంపీపీ పదవుల ఎంపిక విషయాన్ని ఎమ్మెల్యేలకు అప్పగించాలని నిర్ణయించింది. కొన్ని ఎంపీపీ స్థానాలను మినహాయిస్తే అన్నింట్లోనూ ఎమ్మెల్యేల అభీష్టం మేరకే మండల పరిషత్‌ అధ్యక్ష అభ్యర్థులు ఖరారు కానున్నారు. 

►ఆసిఫాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా మాజీ ఎమ్మె ల్యే కోవా లక్ష్మికి, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు అవకాశం ఇస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రకటించా రు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు భార్య భాగ్యలక్ష్మికి మంచిర్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం ఇస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ అధిష్టానం స్పష్టం చేసింది. 

►నల్లగొండ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా బండ నరేందర్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది.  

►నిజామాబాద్‌ జెడ్పీ చైర్మన్‌ పదవిని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి దాదన్నగారి విఠల్‌రావుకు ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ నిర్ణయించారు. విఠల్‌రావు జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

►వరంగల్‌ రూరల్‌ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి జ్యోతికి ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించారు.

ఎందుకిలా...
►తముందుగానే జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులను ప్రకటిస్తే కొన్ని చోట్లఇబ్బందులు వస్తున్నట్లుగా టీఆర్‌ఎస్‌ గుర్తించింది. అందుకే ఎన్నికసమయంలోనే చైర్‌పర్సన్‌ అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది.  

►ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, నల్లగొండ, వరంగల్‌ రూరల్‌ జిల్లాల జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులను అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. కొన్ని ఎంపీపీ స్థానాలను మినహా.. అన్నింట్లోనూ
ఎమ్మెల్యేల అభీష్టం మేరకే మండల పరిషత్‌ అధ్యక్ష అభ్యర్థులుఖరారు కానున్నారు. 

మరిన్ని వార్తలు