తనయుడి కోసం మాతృమూర్తి ఎన్నికల ప్రచారం

3 Nov, 2018 13:59 IST|Sakshi

40 ఏళ్ల కుటుంబ రాజకీయ చరిత్రలోమొదటిసారి ప్రచారంలోకి.. 

భర్త ఏడు సార్లు అసెంబ్లీకి పోటీచేసినా ఎప్పుడూ ప్రచారానికిరాని గిరిజాదేవి

 తొలిసారి గ్రామాల్లో పర్యటన   


రంగారెడ్డి/ పరిగి: తనయుడి కోసం ఆ మాతృమూర్తి ఎన్నికల ప్రచార బాట పట్టింది. 40 ఏళ్ల వారి కుటుంబ రాజకీయ జీవితంలో ఆమె ఏ రోజూ ప్రచారంలో పాల్గొనలేదు. మొదటిసారిగా తన కుమారుడి తరఫున జనంలోకి వచ్చారు. పరిగి అసెంబ్లీ స్థానం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి అత్యధికంగా ఐదుసార్లు శాసన సభ్యునిగా గెలుపొందిన కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఇప్పుడు తనయుడికి పగ్గాలిచ్చి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. భర్త హరీశ్వర్‌రెడ్డి కోసం ఎప్పుడూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనని ఆయన సతీమణి గిరిజాదేవి తనయుడు కొప్పుల మహేష్‌రెడ్డి కోసం ప్రచార బాటపట్టారు. ఆయనను ఎమ్మెల్యేగా చూడాలనే కాంక్షతో ఇంటిల్లిపాది శ్రమిస్తున్నారు. హరీశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా  పోటీచేసిన ప్రతిసారి ప్రచారంలో అన్నీతానై వ్యవహరించే వారు. 

ఇద్దరు తనయులు మహేశ్‌రెడ్డి, అనిల్‌రెడ్డిలు సైతం ఏ రోజూ మైకు పట్టుకుని ప్రచారం చేసే వారు కాదు. కేవలం వారు తెరవెనక వ్యవహారాలు మాత్రమే చూసేవారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో పాటు బంధుగణం అందరు ప్రచారంలో చెమట చిందిస్తున్నారు. సోదరుడు అనిల్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి భార్య ప్రతిమారెడ్డి, బాబాయ్‌ నాగిరెడ్డి తదితర కుటుంభ సభ్యులందరూ మహేశ్‌రెడ్డి కోసం కష్టపడుతున్నారు. ఆయన తల్లి గిరిజాదేవి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకుల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానప్పటికీ ప్రతి ముఖ్యకార్యకర్తను గుర్తుపట్టగలరు. నాయకులు, కార్యకర్తల ఇళ్లలో శుభకార్యాలకు ఆమె వెళ్లేవారు. ఆ పరిచయాలతో ఇప్పుడు ప్రచారం చేయడం సులువుగా మారింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు