ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతే..

27 Nov, 2018 09:56 IST|Sakshi
రోడ్‌ షోకు హాజరైన జనం, ప్రజలకు నమస్కరిస్తున్న మంత్రి హరీశ్‌రావు, చిత్రంలో అభ్యర్థి పైళ్ల

  సఖ్యత లేని కూటమి నేతలు రాష్ట్రాన్నిఎలా పాలిస్తారు?

  కష్టసుఖాల్లో ప్రజలకు అండగా ఉండే వ్యక్తి పైళ్ల శేఖర్‌రెడ్డి

  వలిగొండ రోడ్‌ షోలో రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు 

వలిగొండలో జన ప్రభంజనం చూస్తుంటే పైళ్ల శేఖర్‌రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందని, ఇక తేలాల్సింది ఎదుటి వారికి డిపాజిట్‌ వస్తుందో రాదోనన్న విషయమేనని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వలిగొండలో సోమవారం నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వర్షాకాలం వస్తే ఉసిళ్లు ఎలా వస్తాయో ఓట్ల కాలం వచ్చిందంటే కాంగ్రెసోళ్లు అలాగే వస్తారని.. వర్షం అనంతరం ఉసిళ్లు ఎలా కనిపించవో ఓట్ల అనంతరం మళ్లీ కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు. కష్ట సుఖాల్లో నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండే వ్యక్తి పైళ్ల శేఖర్‌రెడ్డి అని అన్నారు. సఖ్యత లేని కూటమి నేతలు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని విమర్శించారు.

వలిగొండ (భువనగిరి) : వలిగొండలో జనప్రభంజనం చూస్తుంటే పైళ్ల శేఖర్‌రెడ్డి విజయం తథ్యమని తెలుస్తోందని.. ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన పాల్గొని మాట్లాడుతూ  కష్టసుఖాల్లో శేఖర్‌రెడ్డి నియోజకవర్గం ప్రజలకు అండగా ఉండే వ్యక్త అని పేర్కొన్నారు. వర్షాకాలం వస్తే ఉసిళ్లు ఎలా వస్తాయో ఓట్ల కాలం వస్తే కాంగ్రెస్‌ వాళ్లు అలాగే వస్తారని, వర్షం అనంతరం ఉసిళ్లు ఎలా కనిపించవో ఎన్నికల అనంతరం మళ్లీ కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు. 2009లో 9 అంశాలతో ముందుకు వచ్చారని ఓట్లు వేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక 24గంటల విద్యుత్‌ ఇచ్చారా, 6కిలోల బియ్యం ఇచ్చారా, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారా అని అన్నారు.  

ఐక్యత లేనివారు రాష్ట్రాన్నిఎలా పాలిస్తారు..
మహాకూటమిలో ఉన్న కోదండరాం, చంద్రబాబు, చాడ వెంకట్‌రెడ్డిలు ఒకేమాటపై ఉండడం లేదని హరీశ్‌రావు అన్నారు. ఐక్యత లేని వారు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని విమర్శించారు. భువనగిరి జిల్లా అయ్యిందంటే కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, శేఖర్‌రెడ్డి వల్లనేనని గుర్తు చేశారు. కేసీఆర్‌ లేకుంటే జిల్లా అయ్యేదా ఆలోచించాలన్నారు. యాదగిరిగుట్టను కోట్లాది రూపాయలతో మరో తిరుపతిగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేసీఆర్‌ ఉన్నంత కాలం కాంగ్రెస్‌ అధికారంలోకి రాదని వారికి అర్థమైందన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ను నిర్మించకుండా చేస్తామంటున్నారు. మళ్లీ చీకట్లో ఉంచడానికా అన్నారు. మహాకూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు ఏనాడైనా పేదింటి ఆడపడుచుల పెళ్లికి కనీసం రూ.10వేలు ఇచ్చారా అని ప్రశ్నించారు.
 
కాళేశ్వరం పూర్తయితే వలిగొండలో30వేల ఎకరాలకు సాగునీరు..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తయితే వలిగొండ మండలంలోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చంద్రబాబు.. కాళేశ్వరం వద్దని ఢిల్లీకి ఉత్తరాలు రాశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తితో కాంగ్రెస్‌ జతకట్టడం దారుణమమన్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్‌ చచ్చుడోనని 11 రోజలు ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు దగ్గరకు వెళ్లి వచ్చి కేసీఆర్‌ సాధించిన తెలంగాణను తిరిగి ఆంధ్రాపాలకుల చేతిలో పెట్టాలనుకోండం అవసరమా అని అన్నారు. చంద్రబాబు పంపించే నోట్లతో బతకమని, నీరుంటే బతుకుతామని అన్నారు. కాంగ్రెస్‌లో జిల్లానుంచి ముగ్గురు సీఎం అభ్యర్థులు ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారని ఎద్దేవా చేశారు. 

కోటి ఎకరాలకు నీరందించడమే టీఆర్‌ఎస్‌ సంకల్పం : ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌
ఎంపీ బూరనర్సయ్య మాట్లాడుతూ కోటి ఎకరాలకు నీరు అందించాలన్న సంకల్పంతో టీఆర్‌ఎస్‌ పనిచేస్తుందన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధును ఐక్యరాజ్యసమితి అభినందించిందన్నారు. చంద్రబాబు, రాహుల్‌గాంధీలు రాహు, కేతువులు లాంటివారన్నారు. భువనగిరిలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్‌ ఆస్పత్రి సాధించిన ఘనత టీఆర్‌ఎస్‌దేనన్నారు. 
ప్రాజెక్ట్‌లు, కాల్వలకు ప్రాణదాత హరీశ్‌రావు : పైళ్ల
భువనగిరి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి  పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ హరీశ్‌రావు కాల్వలకు, ప్రాజెక్ట్‌లకు ప్రాణదాతని అన్నారు. గత ప్రభుత్వాలు కాల్వలకు గండి పడితే చెంచాడు మట్టి పోశారనని అన్నారు. రూ.2కోట్లతో వలిగొండ చెరువు పనులు చేపట్టామన్నారు. రూ.6 కోట్లు 50 లక్షలతో భీమలింగం పనులు చేపట్టామన్నారు. ఎమ్మెల్యేగా తిరిగి గెలిపిస్తే ఐదారింతల అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం మాజీమంత్రి ఉమా మాధవరెడ్డి మాట్లాడుతూ భీమలింగం కాల్వను పొడిగించిన ఘనత దివంగత మంత్రి మాధవరెడ్డిదేనని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న పథకాలను చూసే టీఆర్‌ఎస్‌లో చేరానని అన్నారు. ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ  55ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 4 సంవత్సరాల 3 నెలల 4 రోజులలో జరిగిందన్నారు.
ఆగమాగం కాకుండా ఆలోచించుకుని కారుగుర్తుకు ఓటేయాలన్నారు. అందెం లింగం యాదవ్‌ మాట్లాడుతూ గొల్లకురుమలకు సముచిత స్థానం కల్పించింది కేవలం టీఆర్‌ఎస్సే అన్నారు. ఈ సందర్భంగా మొగిలిపాకకు చెందిన ముద్దసాని కిరణ్‌రెడ్డి హరీశ్‌రావుకు నాగలిని బహూకరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పైళ్ల రాజవర్ధన్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ  సమితి కన్వీనర్‌ కొల్పుల అమరేందర్, గ్రంథాలయ చైర్మన్‌ జడల అమరేందర్,  ఎంపీపీ శ్రీరాముల నాగరాజు, జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిటిపాముల జ్యోతిసత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ మండలపార్టీ అధ్యక్షుడు బద్ధం భాస్కర్‌రెడ్డి,  మాజీ సర్పంచ్‌ పబ్బు ఉపేందర్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ పనుమటి మమతనరేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అయిటిపాముల ప్రభాకర్,  కొమిరెల్లి సంజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తాలు...

మరిన్ని వార్తలు