టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా.. పట్నం, పోచంపల్లి, తేరా

13 May, 2019 02:03 IST|Sakshi

ఖరారు చేసిన గులాబీ బాస్‌ కేసీఆర్‌ 

రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ జిల్లాల అభ్యర్థులుగా ప్రకటన 

ఈ మూడు జిల్లాల నేతలు,మంత్రులతో సీఎం భేటీ 

సమన్వయంతో పనిచేసి మూడుచోట్లా గెలవాలని సూచన 

నేడు అభ్యర్థుల నామినేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఖరారయ్యారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆది వారం సాయంత్రం అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వరంగల్‌ స్థానానికి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి స్థానానికి పట్నం మహేందర్‌రెడ్డి, నల్లగొండ స్థానానికి తేరా చిన్నపరెడ్డిలను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. మూడు జిల్లాల మంత్రులు, ముఖ్యనేతలు, ముగ్గురు అభ్యర్థులు ఆదివారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిశారు. అనంతరం కేటీఆర్‌ వీరిని సీఎం కేసీఆర్‌ దగ్గరికి తీసుకెళ్లారు. అభ్యర్థుల ఖరారును అధికారికంగా సీఎం వారితో చెప్పారు.

మూడు స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని ఆదేశించారు. అభ్యర్థులకు బీ–ఫామ్‌లు అందజేశారు. మంత్రులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. ప్రజలు ఓటేస్తున్న అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ గెలుస్తోందని.. ప్రజాప్రతినిధులు ఓటేసే ఈ ఎన్నికల్లోనూ అదే ఫలితాలు రావాలని సీఎం సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ఓటర్లతో సమన్వయం చేయా లని అన్నారు. ఓటర్లుగా ఉండే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో నేరుగా మాట్లాడాలని అభ్యర్థులను ఆదేశించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, చామకూర మల్లారెడ్డి తదితరులు సీఎం కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 

నేడు నామినేషన్లు.. 
వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. కాగా సోమవారం మంచిరోజు కావడంతో ఈ ముగ్గురు అభ్యర్థులు నామినేషన్‌ వేయనున్నారు. 2015లో జరిగిన సాధారణ ఎన్నికలలో కొండా మురళీధర్‌రావు (వరంగల్‌), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (నల్లగొం డ), పట్నం నరేందర్‌రెడ్డి (రంగారెడ్డి) స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

ఎమ్మెల్యేలుగా ఎన్నికైనందున రాజగోపాల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి.. టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి మారడంతో కొండా ముర ళీధర్‌రావు డిసెంబరులో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ మూడింటికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఎన్నికలలో వరంగల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మురళీధర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ ఎస్, నల్లగొండ స్థానాన్ని కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి.

అభ్యర్థుల వివరాలు 
ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరకాల మండలం వరికోల్‌ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సొంత ఊరు. పూణేలోని వీకే పటేల్‌ ఫౌండేషన్‌ కాలేజీలో ఎంబీఏ చదివారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌లతో ఒకే రూమ్‌లో ఉండేవారు. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నారు. ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలిచారు. వారిని జైలు నుండి బయటికి తీసుకురావడంలో అనేకసార్లు కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. వరంగల్‌ స్థానిక సంస్థల ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శ్రీనివాస్‌రెడ్డిని కేసీఆర్‌ ఎంపిక చేశారు. 

►ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం గొల్లూరుగూడ పట్నం మహేందర్‌రెడ్డి సొంత గ్రామం. టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1994, 1999, 2009 ఎన్నికలలో తాండూరులో టీడీపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ తరుపున తాండూరులో ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యారు. పట్నం మహేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు పట్నం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. నరేందర్‌రెడ్డి గెలిచారు. మహేందర్‌రెడ్డి ఓడిపోయారు. తాజాగా నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మహేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. 

►తేరా చిన్నపరెడ్డి సొంత ఊరు ఉమ్మడి నల్లగొండ జిల్లా పెదవూర మండలం పినవూర. ఆయన టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానంలో 2014 నల్లగొండ లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2015లో నల్లగొండ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అదే స్థానానికి ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా చిన్నపరెడ్డిని అధినేత కేసీఆర్‌ ఎంపిక చేశారు.

మరిన్ని వార్తలు