టీఆర్‌ఎస్‌లో చల్లారని అసంతృప్తి..!

16 Sep, 2018 09:43 IST|Sakshi

గులాబీ గూటిలో అసంతృప్తి జ్వాలలు ఆరడం లేదు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన వెలువడి వారంరోజులు దాటినా.. అధికార పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశించి దక్కని నేతలు అసంతృప్తి చర్యలు సాగిస్తూనే ఉన్నారు. టికెట్‌ ఆశించి భంగపడిన నేతలు అసమ్మతి వర్గంగా జట్టు కడుతున్నారు. ఆరునూరైనా బరిలో ఉంటామని తెగేసి చెబుతున్నారు. తమకు ఇదే ఆఖరిమోఖా అని, చావోరేవో తేల్చుకుంటామనీ స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతుండగా.. వాటిని ఆపేందుకు అధిష్టానం ప్రయత్నించడం లేదు. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసమ్మతి నేతలుగా ఆందోళనబాట పట్టిన చర్యలు లేవు.. బుజ్జగింపులూ లేవు. దీంతో ‘రెబెల్స్‌’గా పోటీ చేస్తామంటున్నవారు ఇప్పుడు అధిష్ఠానం పిలిచినా ససేమిరా అంటామంటున్నారు. తమకు టికెట్‌ దక్కలేదని కొందరు, దక్కిన వారి టికెట్‌ రద్దు చేయాలంటూ మరికొందరు పలుచోట్ల నిరసనల పర్వం కొనసాగిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: అభ్యర్థుల ప్రకటన నుంచే అసమ్మతికి ఆజ్యం‘ముందస్తు’ ఖాయమని తేలడంతో ఆశావహులంతా ఎవరికీ వారుగా టికెట్‌ కోసం ప్రయత్నాలు చేసుకున్నారు. ఎవరూ ఊహించనివిధంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈనెల 6న ప్రకటించిన 105 మందిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఒక్క చొప్పదండి మినహాయిస్తే 12 నియోజకవర్గాల్లో పాతకాపులకే మళ్లీ అవకాశం కల్పించారు. కొత్తగా టికెట్‌ ఆశించిన వారు, గతంలో పోటీ చేసి ఓడిపోయినవారు, ఈ సారి టికెట్‌ ఖాయమనుకున్నవారు తమ పేర్లు కానరాక పోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో అభ్యర్థుల ప్రకటన వెలువడిన రోజే రామగుండం, వేములవాడలో అసంతృప్తి నేతలు నిరసన స్వరం వినిపించారు.

ఆ తర్వాత మానకొండూరు, మంథని, పెద్దపల్లిలో అభ్యర్థులను మార్చాలని, తమకే అవకాశం ఇవ్వాలని ఆందోళనలు చేపట్టారు. రామగుండంలో సోమారపు సత్యనారాయణకు టికెట్‌ ప్రకటించడంపై ఏకంగా సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పార్టీలో తిరుగుబాటుకు తెరతీశారు. వేములవాడలో వెయ్యిమందికిపైగా హాజరై సభ నిర్వహించి చెన్నమనేని రమేష్‌బాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. మానకొండూరు, మంథనిలో ఆశావహుల అనుచరులు కిరోసిన్‌ డబ్బాలతో వాటర్‌ట్యాంక్‌లు, విద్యుత్‌ టవర్లు ఎక్కి ఆత్యాహత్యాయత్నం చేశారు. మరికొన్ని చోట్ల అసంతృప్తి ఉన్నా... చాపకింద నీరులా సాగుతోంది. వీటన్నింటిపై అధిష్టానం స్పందించకపోవడంతో రోజు రోజుకు నిరసనలు ఆందోళనలు పెరుగుతున్నాయి.
 
‘అసమ్మతి’పై చర్చలు లేవు.. చర్యలూ లేవు

ఉమ్మడి జిల్లాలో రామగుండం, వేములవాడ, మానకొండూరు, మంథని, పెద్దపల్లి తదితర చోట్ల టీఆర్‌ఎస్‌ టికెట్ల కోసం ఆశావహులు చేస్తున్న అసమ్మతి ఆందోళనలు, కార్యకలాపాల విషయంలో ఇంకా ఎలాంటి చర్చలూ స్థానికంగా చేపట్టలేదు. వేములవాడలో తాజా మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అభ్యర్థిత్వాన్ని మార్చాలని ఆయన వ్యతిరేకవర్గం పట్టుబడుతోంది. శనివారం మేడిపెల్లి మండలకేంద్రంలో గల పీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 2500 మంది ఇందులో పాల్గొన్నారు. వేములవాడ వరకు పాదయాత్ర కూడా చేపట్టారు. అలాగే రామగుండం తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ వ్యతిరేకులు ఏకమయ్యారు.

వారం క్రితం ఎన్‌టీపీసీ రామగుండం కృష్ణానగర్‌లోని టీవీ గార్డెన్‌లో అసమ్మతి నేతలంతా సమావేశం నిర్వహించారు. చొప్పదండి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై సందిగ్ధత కొనసాగుతోంది. అధినేత కేసీఆర్‌ చొప్పదండిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఎవరికి టికెట్‌ దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతోపాటు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ఎస్సీసెల్‌ అధ్యక్షుడు సుంకె రవిశంకర్, మాజీమంత్రి గడ్డం వినోద్, తెలంగాణ సాంస్కృతిక మండలి కళాకారిణి వొల్లాల వాణి సైతం టికెట్‌ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రెండుమూడు రోజుల్లో చొప్పదండి అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉండడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొం ది. చివరి నిమిషంలో హైదరాబాద్‌లో మకాం వేసి పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

మరిన్ని వార్తలు