ఎవరి లెక్క వారిదే

23 Jan, 2020 02:09 IST|Sakshi

మున్సిపోల్స్‌ ముగియడంతో మొదలైన అంచనాలు

పోలింగ్‌ సరళిపై ఆరా తీసే పనిలో రాజకీయ విశ్లేషకులు

పోరు ఏకపక్షమే: టీఆర్‌ఎస్‌ .. గట్టిపోటీ ఇచ్చాం: కాంగ్రెస్‌

మా బలమేంటో తెలిసిపోతుంది: బీజేపీ

అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తమ ఖాతాలోకే వస్తాయనే విశ్వాసం టీఆర్‌ఎస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు కనీస పోటీ ఇవ్వలేకపోయాయని ఆ పార్టీ లెక్కగడుతోంది.

టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చామని, గత అన్ని ఎన్నికల కన్నా ఈసారి పార్టీ కేడర్‌లో దూకుడు కనిపించిందని, కనీసం 30–40 శాతం స్థానాల్లో తాము విజయం సాధిస్తామనే అంచనాలో  కాంగ్రెస్‌ ఉంది.

ఎన్నార్సీ, అయోధ్య, కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దు లాంటి అంశాల కారణంగా నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మంచి ఫలితాలు వస్తాయని బీజేపీ చెపుతోంది.

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికలు ముగియడంతో గెలుపోటములపై అంచనాలు మొదలయ్యాయి. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియలో నిమగ్నమైన రాజకీయ పార్టీలు ఆ తర్వాత లెక్కల కుస్తీలో పడిపోయాయి. పార్టీ అధిష్టానాల నుంచి అభ్యర్థులు, వారి అనుచరుల వరకు పోలింగ్‌ సరళిని సమీక్షిస్తూ విజయతీరాలకు చేరుతామా లేదా అనే దానిపై ఓ అవగాహనకు వచ్చారు. అయితే, పార్టీల వారీగా చూస్తే పుర పోరు ఏకపక్షంగానే సాగిందని, పరిషత్‌ ఫలితాలు పునరావృతమవుతాయనే ధీమా అధికార టీఆర్‌ఎస్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలు చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించలేదని, మరోసారి కేసీఆర్‌ నాయకత్వానికే తెలంగాణ ప్రజలు ఆమోదముద్ర వేశారని, 25న జరిగే కౌంటింగ్‌లో అధికారికంగా ఫలితాలు వెలువడటమే తరువాయి అనే అభిప్రాయంలో ఆ పార్టీ నేతలున్నారు.

ఇక, టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చామని, గత అన్ని ఎన్నికల కన్నా ఈసారి పార్టీ కేడర్‌లో దూకుడు కనిపించిందని, కనీసం 30–40 శాతం స్థానాల్లో తాము విజయం సాధిస్తామనే అంచనాలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ కూడా ఉంది. బీజేపీ కూడా తాము ఎంపిక చేసుకున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సత్తా చాటుతామని చెబుతోంది. ఎంఐఎంలో కూడా ఫలితాలపై పాజిటివ్‌ అంచనాయే కనిపిస్తుండగా, వామపక్షాలు, టీజేఎస్‌ల భవితవ్యం ఈనెల 25 తర్వాతే తేలనుంది. మొత్తమ్మీద బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే అధికార  టీఆర్‌ఎస్‌కు భారీ విజయం తథ్యమని, రెండో స్థానంలో కాంగ్రెస్‌ ఉంటే.. బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

పరిషత్‌.. పునరావృతం
మున్సిపోల్స్‌ జరిగిన తీరుపై అధికార టీఆర్‌ఎస్‌లో ఉత్సాహం కన్పిస్తోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా తమదే విజయమని, ఎన్నికలు జరిగిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు తమ ఖాతాలోకే వస్తాయనే విశ్వాసం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ప్రతిపక్షాలు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయని, ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో చైర్మన్‌ స్థానాలను దక్కించుకునే స్థాయి కంటే ఎక్కువ స్థానాల్లోనే గెలుస్తామని చెబుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్‌ నాయకత్వంపై పట్టణ ప్రాంత ఓటర్లు సంపూర్ణ విశ్వాసాన్ని కనబర్చారని, ఆయన పెట్టిన పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఒక అవగాహనకు వచ్చిన తర్వాతే తమకు అండగా నిలిచారని పోలింగ్‌ సరళి చెబుతోందని పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం ప్రతిపక్షాలు కచ్చితంగా గెలుస్తాయని చెప్పుకునే ఒక్క స్థానం కూడా లేదంటే తమ పనితీరుకు పట్టణ ప్రజలు ఎలాంటి సర్టిఫికెట్‌ ఇవ్వబోతోందో అర్థమవుతోందని టీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌తో పాటు ఖమ్మంలోని ఒకటి, రెండు చోట్ల మాత్రమే తమకు ప్రతిపక్షాల నుంచి పోటీ కనిపించిందే తప్ప రాష్ట్రంలో ఎక్కడా ప్రతిపక్షాల ప్రభావం కనిపించలేదని వ్యాఖ్యానించారు.

వారి ప్రలోభాలే.. మా పోటీకి నిదర్శనం
అధికార పార్టీ ఆలోచన అలా ఉంటే ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో కూడా మున్సిపోల్స్‌పై సంతృప్తి వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగం, ప్రలోభాల పర్వాలకు వెరసి తమ కేడర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసిందని, అధికార పార్టీ అడ్డగోలుగా ప్రలోభాలకు గురిచేయడమే తాము దీటైన పోటీలో ఉన్నామనేందుకు నిదర్శమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా నల్లగొండ, భువనగిరి, మల్కాజ్‌గిరి పార్లమెంటు స్థానాలో పరిధిలో మంచి ఫలితాలు వస్తాయని, రాష్ట్రంలోని ఒకట్రెండు లోక్‌సభ స్థానాలు మినహా అన్ని చోట్లా అధికార టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓటర్ల జాబితా నుంచి పోలింగ్‌ షెడ్యూల్, పోలింగ్‌ ప్రక్రియ వరకు అన్ని దశల్లో టీఆర్‌ఎస్‌ అవకతవకలకు పాల్పడింది. తన చేతిలో ఉన్న అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేసింది. ఇష్టారాజ్యంగా డబ్బులు పంపిణీ చేసింది. అయినా మేం కనీసం 40 శాతం స్థానాల్లో గెలవబోతున్నాం. ఇదే కాంగ్రెస్‌కు తెలంగాణలో ఉన్న పునాది అని నిరూపించబోతున్నాం’అని ఓ కాంగ్రెస్‌ ముఖ్య నేత వ్యాఖ్యానించారు. దక్షిణ తెలంగాణలో భారీగా, ఉత్తర తెలంగాణలో ఓ మోస్తరుగా తాము గెలుస్తామని, బీజేపీ తమకు కనీస దూరంలో కూడా ఉండదని ఆయన చెప్పారు. 

వికసిస్తాం.. కానీ!
మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ సరళిపై కమలనాథులు కూడా కసరత్తు చేస్తున్నారు. ఆ పార్టీ నేతల ప్రాథమిక అంచనాల ప్రకారం తాము ఎంపిక చేసుకుని పనిచేసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మంచి ఫలితాలు వస్తాయనే ధీమా కనిపిస్తోంది. ఎన్నార్సీ, అయోధ్య రామమందిరం, కశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ రద్దు లాంటి అంశాల కారణంగా నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఊహించని ఫలితాలు వస్తాయని బీజేపీ నేతలు చెపుతుండటం గమనార్హం. మిగిలిన చోట్ల కూడా మంచి ఫలితాలే వస్తాయని, అయితే, అధికార పార్టీ దుర్వినియోగం, ప్రతిపక్షాల ఓట్లలో చీలిక కారణంగా ఫలితాలు తారుమారవుతాయేమోనని కమలనాథులు పేర్కొంటున్నారు. ఇక, గతం కన్నా మెరుగవుతామని, నిజామాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో చెప్పుకోదగిన స్థానాల్లో విజయం లభిస్తుందని ఎంఐఎం కూడా భావిస్తోంది. మిగిలిన వామపక్షాలు, టీజేఎస్‌ తదితర పార్టీలు ఎన్ని స్థానాలు దక్కించుకుంటాయనేది ఫలితాల వెల్లడి తర్వాతే స్పష్టం కానుంది.

అంచనాల కోసం అభ్యర్థుల అగచాట్లు
రాజకీయ వర్గాలు, పార్టీ నాయకత్వాల మాటెలా ఉన్న మున్సిపోల్స్‌ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. బూత్‌ల పరిసరాల్లో ఉన్న అభ్యర్థులు, వారి అనుచరులు పోలింగ్‌ ముగియగానే అంచనాల్లో పడిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ బూత్‌కు ఎవరొచ్చారు.. ముందు అనుకున్న విధంగా తమకు అనుకూల ఓట్లు ఎన్ని పోలయ్యాయి.. చివరి నిమిషాల్లో తమ ఓటర్లను పోలింగ్‌ బూత్‌లకు తీసుకొచ్చామా లేదా.. ఏ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఏం చేశారు? మొత్తం పోలైన ఓట్లలో ఎన్ని తమకు వచ్చి ఉంటాయనే దానిపై అంచనాకు వచ్చేందుకు బుధవారం రాత్రంతా అగచాట్లు పడ్డారు. 

మరిన్ని వార్తలు