జగిత్యాల: ద్విముఖ పోరు

1 Dec, 2018 10:39 IST|Sakshi

వరుస విజయాలతో జీవన్‌రెడ్డి దూకుడు 

గులాబీ జెండా ఎగురవేస్తామంటున్న సంజయ్‌ 

ప్రచారం ముమ్మరం చేసిన ముదుగంటి రవీందర్‌రెడ్డి 

సాక్షి,జగిత్యాల(కరీంనగర్‌) : జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట. 1952లో ఏర్పడిన నియోజకర్గ పరిధిలో జగిత్యాల, రాయికల్, సారంగాపూర్‌ మండలాలు ఉన్నాయి. 17 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ 10 సార్లు, టీడీపీ 4సార్లు విజయం సాధించాయి. రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ 12 సీట్లు గెలుచుకుంటే.. జగిత్యాలను మాత్రం జీవన్‌రెడ్డి కైవసం చేసుకున్నారు. అయితే ఈ సారి ఎలాగైన జగిత్యాల కోటపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని పార్టీ అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌ జోరుగాప్రచారం చేస్తున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి ముదుగంటి రవీందర్‌రెడ్డి ప్రచారంలో మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకెళ్తున్నారు.

యావర్‌రోడ్డు పూర్తికావాలి.                                   
పాతబస్టాండ్‌ను విస్తరించాలి.  
మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలి. 
ఆయకట్టు కాలువల మరమ్మతులు చేపట్టాలి. 
నూతన ఫిల్టర్‌బెల్డ్‌ను లింగంపేట చెరువుకు కాకుండా నూతన చెరువుకు కలపాలి. 
జగిత్యాల పట్టణంలో రూ.5కోట్లతో నిర్మించిన టౌన్‌వాల్‌ 25ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది. దానిని ఉపయోగంలోకి తేవాలి. 
రాయికల్‌ మున్సిపాలిటీ అయిన్పటికీ... బస్టాండ్‌ ఏర్పాటు చేయాలి. 
రాయికల్‌లోని మాదికకుంట స్థలాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. 
పాత సారంగాపూర్‌ మండలంలో మిషన్‌భగీరథ అస్తవ్యస్తంగా ఉంది. 
మండలంలోని రోల్లవాగు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. నిర్వాసితులకు ఇంకా పరిహారం అందలేదు. 
సాంగాపూర్, బీర్‌పూర్‌ మండలాల కు కలిపి డిగ్రీకళాశాల ఏర్పాటు చేయాలని అక్కడి విద్యార్థులు కోరుతున్నారు. 

సిట్టింగ్‌ ఎమ్మెల్యే ప్రొఫైల్‌.. 


జగిత్యాల జిల్లాపెగడపల్లి మండలం బతికెపల్లి గ్రామానికి చెందిన జీవన్‌రెడ్డి న్యాయవాదిగా జగిత్యాలలో స్థిరపడ్డారు. మొట్టమొదటిసారిగా మల్యాల సమితి అధ్యక్షుడిగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్‌లో చేరి అప్పటి నుండి చేతిగుర్తు తరుఫునపోటీ చేసి ఇప్పటి వరకు 6సార్లు గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

  సంజయ్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌) 


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ది జగిత్యాల మండలం అంతర్గాం. వృత్తిరీత్యా కంటి వైద్య నిపుణులుగా జగిత్యాలలో స్థిరపడ్డారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుఫున టికెట్‌ దక్కింది. అప్పుడు పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ అప్పటి నుంచి ప్రజల్లోనే ఉంటూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడ్డారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ ఆయనకే టికెట్‌ కట్టబెట్టింది. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే సంజయ్‌కుమార్‌ను ఎలాగైనా గెలిపించి రికార్డు సృష్టించాలని ఎంపీ కవిత పట్టుపట్టారు. ఆయన తరఫున ముందుండి ప్రచారం చేస్తున్నారు. ఊరూరా తిరిగి, సంజయ్‌కుమార్‌ను గెలిపించి, జగిత్యాల కోటలో గులాబీ జెండా ఎగురవేయాలని ప్రజలను కోరుతున్నారు.

ముదుగంటి రవీందర్‌రెడ్డి (బీజేపీ) 


మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన ముదుగంటి రవీందర్‌రెడ్డి మొదటి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు. 24 ఏళ్లుగా పొత్తులో భాగంగా బీజేపీ నుంచి పోటీచేసే అవకాశం రాలేదు. ప్రస్తుతం అవకాశం రావడంతో రవీందర్‌రెడ్డి ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తున్నారు. ఆయన బీఈ ఇంజినీరింగ్‌ చేసినప్పటికీ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. 

జగిత్యాల నియోజకవర్గం వార్తల కోసం...

మరిన్ని వార్తలు