అభ్యర్థుల దూకుడు..!

28 Nov, 2018 13:41 IST|Sakshi
మహిళల సమస్యలు తెలుసుకుంటున్న పుట్ట మధు

ఊపందుకున్న ప్రచారం

ప్రధాన పార్టీల పోటాపోటీ ప్రదర్శనలు

అర్ధరాత్రి వరకు మంతనాలు

సాక్షి, మంథని : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారానికి 8 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారంను ముమ్మరం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నెల రోజుల కిందే అభ్యర్థులను ప్రకటించడంతో మంథని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధు ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించి నియోజకవర్గాన్ని చుట్టి వచ్చారు. శుభకార్యాలు, అశుభ కార్యక్రమాల పేరిట ప్రజలను పలకరించారు. రెండు ప్రధాన పార్టీల మధ్యే పోటీ ప్రధానంగా నెలకొనడంతో ఇద్దరు పత్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. పోటాపోటీగా గ్రామాల్లో ప్రచార రథాలను దింపారు. ఓటర్లను ఆకర్షించేలా పాటలు, ప్రత్యర్థుల వైఫల్యాలు, తమ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రచార రథాల్లో దూసుకుపోతున్నారు. మహిళలు, యువకులతో ప్రత్యేక సమావేశాలు, చేరికలను ఓవైపు చేస్తూనే ఇంటించా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం, రాత్రి సమావేశాలు నిర్వహిస్తూ పొద్దంతా గ్రామాల్లోనే ప్రచారం చేస్తున్నారు.

గతం కంటే భిన్నం..
నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు గతం కంటే భిన్నంగా జరుగుతున్నాయి. ఓటర్లు ఎవరి వైపు ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొనడంతో అభ్యర్థులు వారి మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అభ్యర్థులే కాకుండా వారి బంధువులు, కూతుళ్లు, కుమారులు కూడా ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈనెల 30న మంథనిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన, వచ్చేనెల 1 లేదా 2న సినీ నటి విజయశాంతి, ప్రజా గాయకుడు గద్దర్‌తోపాటు ఇతర నాయకుల పర్యటనలు సైతం ఉండండంతో రాజకీయం రసవత్తరంగా మారింది. తూర్పు మండలాల్లో రెండు రోజులుగా ఇద్దరు అభ్యర్థులు పోటాపోటీ ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.

>
మరిన్ని వార్తలు