మరింత దూకుడు

18 Mar, 2018 01:04 IST|Sakshi

పార్లమెంటులో ఆందోళన తీవ్రతరం చేసే దిశగా టీఆర్‌ఎస్‌ యోచన

రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై కొనసాగనున్న పోరాటం

అవిశ్వాస తీర్మానం అంశంలో వ్యూహాత్మకంగా అడుగులు

వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు మద్దతివ్వవద్దని నిర్ణయం!

ఓటింగ్‌ వరకు వస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు

పరిస్థితులను బట్టి మసలుకోవాలని పార్టీ ఎంపీలకు సూచనలు

‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ కార్యాచరణ మొదలుపెడుతున్న కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : పార్లమెంటులో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. మైనారిటీలు, ఎస్టీల రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ ఎంపీలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించినట్లు తెలిసింది. ఇక ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం. పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా మసలుకోవాలని.. హడావుడిగా వైఎస్సార్‌సీపీ, టీడీపీలకు మద్దతు ప్రకటించకూడదని తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ వరకు వెళితే మాత్రం ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ‘‘అవిశ్వాస తీర్మానాలను లోక్‌సభ స్పీకర్‌ ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు కదా.. పరిగణనలోకి తీసుకుని చర్చ చేపడితే దానిపై నిర్ణయం తీసుకుంటాం. సోమవారం సభలో చర్చ జరిగితే అదే రోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటాం..’’అని కేసీఆర్‌ సన్నిహితుడు, పార్టీ ఎంపీ ఒకరు పేర్కొన్నారు. ‘‘అసలు అవిశ్వాస తీర్మానాలు ఆమోదించే వరకు ఎందుకొస్తుంది. సభలో గందరగోళమే ఉంది కదా.. రిజర్వేషన్ల బిల్లుపై మా ఆందోళన కొనసాగుతుంది.’’అని మరో ఎంపీ వెల్లడించారు. 

ఆ పార్టీలకు దూరంగానే..! 
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయకుంటే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆవిర్భావ నినాదమే చెదిరిపోతుందని కేసీఆర్‌ కొందరు పార్టీ ముఖ్యులతో అభిప్రాయం పంచుకున్నట్లు తెలిసింది. కానీ టీడీపీ, వైఎస్సార్‌సీపీకి, కాంగ్రెస్‌కు మద్దతుగా నిలబడి వారికి రాజకీయ ప్రయోజనం కల్పించేలా వ్యవహరించకూడదని ఆయన పార్టీ ఎంపీలను అప్రమత్తం చేసినట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసే పరిస్థితి వచ్చేంత వరకు టీఆర్‌ఎస్‌ వైఖరిని బహిరంగ పర్చాల్సిన అవసరం లేదని.. రాష్ట్ర సమస్యలపై ఆందోళనలు కొనసాగించాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే అవిశ్వాసంపై ఓటింగ్‌ వరకు వెళితే నిర్ణయాత్మక వైఖరిని అనుసరించాల్సి వస్తుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. అదే జరిగితే బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాలని, అవిశ్వాసం పెట్టిన పార్టీలకు మాత్రం అంటీ ముట్టనంత దూరంలో ఉన్న సంకేతాలు జారీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఫ్రంట్‌ ఆలోచనలకు పదును 
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ఏర్పాటు చేస్తానని ప్రకటించిన కేసీఆర్‌.. తన ప్రతిపాదనకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తన ప్రకటన అనంతరం అనూహ్యంగా జరిగిన పలు పరిణామాలను కేసీఆర్‌ నిశితంగా బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలోనూ జాతీయ స్థాయిలో అందరి దృష్టి తనవైపు తిప్పుకునేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, చాలాకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ను ఎండగట్టడం ద్వారా ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’కు మద్దతు కూడగట్టాలనేది ఆయన ఆలోచన. ఎన్డీయేకు వ్యతిరేక పక్షాలన్నీ ఒక్కటవుతున్న తరుణంలో తనతో కలసివచ్చే పార్టీలతో సంప్రదింపులు, సమాలోచనలు ముమ్మరం చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం నుంచే ఫెడరల్‌ ఫ్రంట్‌ జాతీయ భేరీకి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 

మమతా బెనర్జీతో భేటీ కానున్న సీఎం 
సోమవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాల అంశం ఉత్కంఠ రేపుతున్న సమయంలోనే.. కేసీఆర్‌ కోల్‌కతా వెళ్లి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు, భవిష్యత్తు ప్రణాళికపై వారు చర్చించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన అనంతరం కేసీఆర్‌.. ఫ్రంట్‌ ఏర్పాటు దిశగా కీలక కార్యాచరణను ప్రకటిస్తారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని వార్తలు