టీఆర్‌ఎస్ విమర్శలు అర్థరహితం

2 Sep, 2014 02:34 IST|Sakshi
టీఆర్‌ఎస్ విమర్శలు అర్థరహితం

- తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఏనాడూ అనలేదు
- బీజేపీ ఎంపీ అభ్యర్థి తూర్పు జయప్రకాష్‌రెడ్డి
సిద్దిపేట జోన్: తాను పార్టీలు మారిన విషయాన్ని రచ్చ చేస్తూ రాజకీయ పార్టీలు అనవసర వ్యాఖ్యలు చేయడం అర్థరహితమని, తన పార్టీ మార్పు విషయం ప్రస్తుతం అప్రస్తుతమని మెదక్ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాష్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక వీఏఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమైక్యవాదిగా ముద్రపడిన తనకు బీజేపీ టికెట్ ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ టీఆర్‌ఎస్ నేతలు ప్రతికల్లో విమర్శలకు దిగడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్నారని గుర్తు చేశారు.

తన రాజకీయ జీవితం బీజేపీతోనే మొదలైందని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ వస్తే తాను ఏనాడు రాజకీయ సన్యాసం తీసుకుంటానని బహిరంగ ప్రకటన చేయలేదని విలేకరులడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు స్థానిక ఎన్నికలు కావన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ప్రతికా ముఖంగా విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటు వేసి వృథా చేసుకోవద్దన్నారు. మెదక్ ఎంపీగా తాను గెలిస్తే ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడి జిల్లాకు సాగు, తాగు నీరుతో పాటు రైల్వే సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.

అదే విధంగా సంగారెడ్డి తరహాలోనే సిద్దిపేటను అభివృద్ధి చేస్తానన్నారు. రూ. 110 కోట్లను అడ్డుకున్నానని తనపై మంత్రి హరీష్ విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకున్నే గెలిపించాలని కోరారు. ప్రజలు నరేంద్రమోడీని చూస్తున్నారని, బీజేపీని గెలిపిస్తే మంచి రోజులు వస్తాయన్నారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు వంగ రాంచంద్రారెడ్డి, గుండ్ల జనార్దన్, దూది శ్రీకాంత్‌రెడ్డి, విద్యాసాగర్, రాంచందర్‌రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు