ఉద్యమ పార్టీకే అందలం..!

7 Nov, 2018 14:54 IST|Sakshi

2014లో టీఆర్‌ఎస్‌కే ప్రజల ఆశీర్వాదం

ఎంపీ, ఆరుగురు ఎమ్మెల్యేల విజయం

సాక్షి, యాదాద్రి :  తెలంగాణ రాష్ట్ర సాధనే సింగిల్‌ ఎజెండాతో ఉద్యమం సాగించిన టీఆర్‌ఎస్‌కు 2014లో జిల్లా ప్రజలు అధికారం అప్పగించారు. 2001లో ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడింది. అయితే 2004, 2009 ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజల ఆదరణ లభించలేదు. ఒక్క ఆలేరు నియోజకవర్గంలోనే టీఆర్‌ఎస్‌ 2004 ఎన్నికల్లో విజయం సాధించగా, 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే స్థానిక సంస్థల్లో  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భాగమైన భువనగిరి డివిజన్‌లో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ల వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస ఘన విజయాలను నమోదు చేసింది.

అదే ఊపుతో నల్లగొండ జిల్లాలో 2014లో జరిగిన ఎన్నికల్లో 12 అసెంబ్లీ స్థానాల్లో 6 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుని విజయం ఢంకా మోగించింది. భువనగిరి పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలైన భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించింది. అంతకు ముందు రాష్ట్ర సాధనే ప్రధాన ఎజెండాగా 14 సంవత్సరాలు ఉద్యమాన్ని ప్రజాస్వామ్యయుతంగా నడిపింది. తెలంగాణ ఉద్యమకాలంలో జిల్లాలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒక్క ఆలేరు నియోజకవర్గంలో తప్ప ఎక్కడ ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఆలేరు ఆసెంబ్లీ స్థానంలో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌  భువనగిరి నియోజకవర్గంలో ఓడిపోయింది. 2009లో మహాకూటమితో పొత్తుపెట్టుకుని పోటీచేసిన ఆలేరుతో పాటు హుజూర్‌నగర్, సూర్యాపేట, అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. 


రెండు సార్లు ఆలేరులో గెలిచిన నగేశ్‌ 
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని 2004 ఎన్నికల బరిలో దిగింది. ఆలేరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్‌ నగేశ్‌ టీడీపీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులుపై విజయం సాధించారు. అదే ఎన్నికల్లో భువనగిరిలో పోటీ చేసిన ఆ పార్టీ నేత ఆలె నరేంద్ర టీడీపీ అభ్యర్థి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. నకిరేకల్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసిన డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ ఓటమి పాలయ్యారు. 2008లో కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ కోసం ఆలేరు ఎమ్మెల్యే డాక్టర్‌ నగేశ్‌ తొలిరాజీనామా చేశారు. వెంటనే జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నగేశ్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

2009 నాటికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. మహాకూటమిలో చేరిన టీఆర్‌ఎస్‌ జిల్లాలో నాలుగు చోట్ల పోటీ చేసి అన్ని చోట్ల పరాజయం పాలయ్యింది. టీడీపీ, వామపక్షాలతో కలిసిన టీఆర్‌ఎస్‌ మహాకూటమి పేరుతో జిల్లాలోని ఆలేరు, సూర్యాపేట, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యింది. ఆలేరులో కాంగ్రెస్‌ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌ చేతిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్లెంయాదగిరిరెడ్డి ఓటమిపాలయ్యారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతిలో, సూర్యాపేటలో పోరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి చేతిలో పరాజయం పొందారు. 


2014 నాటికి సీన్‌ రివర్స్‌ 
తెలంగాణ సాధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జిల్లాలో సగం సీట్లు కైవసం చేసుకుంది. భువనగిరి పార్లమెంట్‌ స్థానంలో  విజయం సా«ధించింది. టీఆర్‌ఎస్‌ నుంచిపోటీ చేసిన డాక్టర్‌ బూరనర్సయ్యగౌడ్‌ విజయం సాధించారు.12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6చోట్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించారు. సూర్యాపేటలో గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరులో గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నకిరేకల్‌లో వేముల వీరేశం, తుంగతుర్తిలో గాదరి కిశోర్‌లు విజయం సా«ధించి అసెంబ్లీకి వెళ్లారు. సూర్యాపేట నుంచి గెలిచిన జగదీశ్‌రెడ్డి రాష్ట్ర మంత్రిగా, ఆలేరు నుంచి గెలిచిన  గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి ప్రభుత్వ విప్‌గా సేవలందించారు. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు