హలో.. మైక్‌ టెస్టింగ్‌!

5 Sep, 2018 08:28 IST|Sakshi

అసెంబ్లీ బరిలో రేసుగుర్రాలు

తొలి విడత ఐదుగురు సిట్టింగ్‌లకు లైన్‌ క్లియర్‌  

మల్కాజిగిరినుంచి కార్పొరేటర్‌ విజయశాంతి?  

అసెంబ్లీ బాటపట్టే యోచనలోఎంపీ మల్లారెడ్డి!

ఉప్పల్, మేడ్చల్‌స్థానాలపై ఊగిసలాట

ఎల్బీనగర్‌కు రామ్మోహన్‌గౌడ్‌?

సాక్షి,సిటీబ్యూరో: ప్రస్తుత శాసనభ రద్దుకు వేగంగా పావులు కదుపుతున్న నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే పలు సర్వేలు చేయించుకున్న పార్టీ, తాజా పరిస్థితులను అంచనా వేస్తూ ముందస్తుగా అభ్యర్థుల ప్రకటనలకు తెరలేపుతోంది. తాము ఏకాభిప్రాయం వ్యక్తమైన స్థానాల్లో వారికే నేరుగా ఫోన్‌ చేసి ‘పని చేసుకోవాల్సింది’గా పార్టీ ముఖ్యనేతలు సూచిస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం ప్రగతిభవన్‌ నుంచి నగరానికి చెందిన పలువురు అభ్యర్థులకు ఫోన్లు వెళ్లినట్టు సమాచారం. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన సనత్‌నగర్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్, వివేకానంద్, కృష్ణారావు, సాయన్నతో పాటు సికింద్రాబాద్‌ నుంచి మరోసారి మంత్రి పద్మారావుకు నియోకజవర్గంలో ఎన్నికల మైక్‌పట్టుకోమంటూ ప్రధాన నేతలు తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలపై కొద్ది రోజులుగా జరుగుతున్న తర్జనభర్జనల అనంతరం మంగళవారం మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో సూచనప్రాయంగా అభ్యర్థుల స్థానాలను ఖరారు చేసినట్లు సమాచారం.

మల్కాజిగిరిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్‌ విజయశాంతి పేరుపై వాడీవేడిగా చర్చ జరిగిందని విశ్వసనీయ సమాచారం. ఐతే ఈ మారు కూడా తానే పోటీ చేసేందుకు కనకారెడ్డి మొగ్గు చూపుతున్న దృష్ట్యా, ఆయనతో చర్చించిన తర్వాత విజయశాంతి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఇదే నియోకజవర్గానికి చెందిన ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు సైతం ఈసారి ఎమ్మెల్యే టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు. మంగళవారం జరిగిన సమావేశానికి హన్మంతరావు హాజరు కాలేదు. ఇక మేడ్చల్, ఉప్పల్‌ నియోజకవర్గాలపై కూడా చర్చ జరిగినప్పుటికీ అధికారిక ప్రకటనకు మరికొంత సమయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. మేడ్చల్‌ లేదా ఉప్పల్‌ స్థానాలపై ఎంపీ మల్లారెడ్డి లేదా ఆయన సమీప బంధువు మర్రి రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. దీంతో ఈ రెండు స్థానాలను ఇప్పటికిప్పుడు పేర్లను ప్రకటించకుండా మరికొంత సమయం తీసుకోవాలని, మరో సర్వే నిర్వహించాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల కథనం. మేడ్చల్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో పాటు ఎంపీ మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్లపైనా చర్చించినట్టు తెలిసింది. ఎల్బీనగర్‌ నియోకజవర్గం నుంచి గతంలో పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్‌గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వీరిద్దరి అభ్యర్థిత్వాలపైనా చర్చింది. అయితే, చివరకు రామ్మోహన్‌గౌడ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

ఉప్పల్‌ నియోకజవర్గానికి సంబంధించి మరికొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నారు. త్వరలోనే సికింద్రాబాద్, చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు పార్టీ ముఖ్యులు పేర్కొంటున్నారు.  

మరిన్ని వార్తలు