తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీలేదు: నామా

18 Jun, 2019 16:37 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన లోక్‌సభ సభ్యులు మంగళవారం పదవీ స్వీకారం ప్రమాణం చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి 9 మంది, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒకరు ఎంపీలుగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. తెలంగాణ ప్రజలు తమ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామని టీఆర్‌ఎస్‌ లోక్‌సభపక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘తెలంగాణ ప్రజలకు, సీఎం కేసీఆర్, కేటీఆర్కు కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కలిసి కట్టుగా పోరాటం చేస్తాం. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌, మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. గడిచిన 5 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చిందేం లేదు. వీలైనన్ని ఎక్కువ నిధులు సాధించేందుకు కృషి చేస్తాం’ అని అన్నారు. 

గడిచిన ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సహకరించలేదని, బీజేపీ నాయకులు కేవలం మాటలకు పరితమయ్యారని ఆపార్టీ డిప్యూటి ఫ్లోర్లీడర్ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. తమపై నమ్మకం ఉంచి 9 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల సాధనతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించిందని గుర్తుచేశారు. సభలో ఆయన మాట్లాడుతూ..  ‘‘గడిచిన ఏళ్లలో అనేక సమస్యలపై పోరాటం చేశాం. హైకోర్టు, జాతీయ రహదారులు ఇలా ప్రతిదాన్నీ పోరాడే సాధించుకున్నాం. భవిష్యత్‌లో కూడా ఇలాంటి పంథానే అవలంభిస్తాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టులకు నిధులు సాధించేందుకు కృషి చేస్తాం. గత కేంద్ర ప్రభుత్వం మాకు సహకరించలేదు. బీజేపీ నేతలు భ్రమలో ఉన్నారు’’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు