పార్టీ బలోపేతమే లక్ష్యం

12 Sep, 2019 03:04 IST|Sakshi

పురపాలక ఎన్నికల్లో విజయం కోసం పనిచేయండి: కేటీఆర్‌

15 లోగా సంస్థాగత కమిటీల నిర్మాణం పూర్తి చేయాలి

దసరా నాటికి పార్టీ జిల్లా కార్యాలయాలు ప్రారంభం

పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో కేటీఆర్‌ భేటీ

కేటీఆర్‌ను కలసిన కడియం, నాయిని తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ కార్యాచరణ ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాల యంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్య దర్శులతో ఆయన భేటీ అయ్యారు. 60 లక్షల మంది కార్యకర్తలతో దేశంలోనే టీఆర్‌ఎస్‌ బలమైన పార్టీల్లో ఒకటిగా నిలిచిందని, సంస్థాగత బలంతో ప్రభుత్వ కార్య క్రమా లను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని పేర్కొన్నారు.

ఇప్పటికే 50 లక్షల సభ్యత్వాల డిజిటలైజేషన్‌ పూర్తయిందని, మరో 10 లక్షల మంది కార్యకర్తల వివరాల కంప్యూట రీకరణ కొనసాగుతోందని వెల్లడించారు. గ్రామ, మండల, డివిజన్‌ స్థాయితో పాటు అన్ని రకాల సంస్థాగత కమిటీల నిర్మాణం ఈ నెల 15లోగా పూర్తి చేయాలన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నిర్మాణంపై జిల్లాల వారీగా కేటీఆర్‌ సమీక్ష నిర్వహిం చారు. చాలా జిల్లాల్లో కమిటీల నిర్మాణం పూర్తయిన విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కేటీఆర్‌ దృష్టికి తెస్తూ.. కమిటీల వివరాలను కేటీఆర్‌కు సమర్పించారు.

మున్సిపాలిటీల వారీగా సేకరించిన వివరాల నివేదికను ప్రధాన కార్యదర్శులు కేటీఆర్‌కు అందజేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు. పురపాలక ఎన్నికల్లో విజయం సాధించేలా ఎమ్మెల్యేలు స్థానిక పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలన్నారు. త్వరలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

కేటీఆర్‌తో కడియం, నాయిని భేటీ
తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు బుధవారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కడియం శ్రీహరి,తాటికొండ రాజయ్య, నాయిని నర్సింహారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి తదితరులు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ముఖ్య నేతలకు సీఎం త్వరలో కీలక పదవులు అప్పగిస్తారనే వార్తలతో పాటు, ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పలువురు నేతలు కేటీఆర్‌ను కలిశారు. మంత్రివర్గంలో మాదిగలకు ప్రాతినిథ్యం లేదని తాటికొండ రాజయ్య వ్యాఖ్యనించగా, తనకు మంత్రి పదవి ఇస్తానంటూ సీఎం మాట తప్పారంటూ నాయిని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మరోవైపు కడియంకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు కేటీఆర్‌ను కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తెలంగాణ భవన్‌లో ఘన స్వాగతం
రెండోసారి రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావడంతో.. టీఆర్‌ఎస్‌ యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు నేతృత్వంలో కార్యకర్తలు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్‌.. తొలుత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్, అసెంబ్లీలో విప్‌లుగా నియమితులైన బోడకుంటి వెంకటేశ్వర్లు, కర్నె ప్రభాకర్, భాను ప్రసాదరావు, బాల్క సుమన్‌కు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు