గులాబీ దళానికి 18 ఏళ్లు 

26 Apr, 2019 03:20 IST|Sakshi

నిరాడంబరంగా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం 

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం ఈసారి ఎలాంటి హడావుడి లేకుండా జరగనుంది. లోక్‌సభ ఎన్నికల నియమావళి.. పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర తెలిపారు. 2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఏటా వార్షికోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారీ బహిరంగసభతో పాటు, పార్టీ ప్రతినిధులతో ప్లీనరీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ నెల 27న జరగనున్న టీఆర్‌ఎస్‌ 18వ ఆవిర్బావ దినోత్సవాన్ని సాదాసీదాగా నిర్వహించాలని కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేవలం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలోని పార్టీ బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు టీఆర్‌ఎస్‌ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. తెలంగాణ భవన్‌లో జరగనున్న పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొంటారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొననున్నారు. 

కీలక మైలురాయి: కేటీఆర్‌ 
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్‌రన్‌ విజయవంతం కావడంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఖరీఫ్‌లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంలో ఈ ప్రక్రియ కీలకమైందని పేర్కొన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించే భారీ ప్రణాళికలో ఇదో కీలక మైలురాయిగా కేటీఆర్‌ అభివర్ణించారు. లక్షల మంది రైతుల సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడనుందని గురువారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు