వ్యూహాత్మకంగా... ఆఖర్లో ఖరారు 

9 May, 2019 04:08 IST|Sakshi

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై టీఆర్‌ఎస్‌ ఎత్తుగడ 

రంగంలోకి బలమైన అభ్యర్థులు 

మూడు స్థానాల్లో గెలుపే లక్ష్యం

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలిలో పూర్తి ఆధిపత్యంతో ఉన్న టీఆర్‌ఎస్‌... ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లోనూ కచ్చితంగా గెలుపు సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీలోకి దించాలని నిర్ణయించింది. 2015లో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు జరిగాయి.అప్పుడు నల్ల గొండ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచారు. ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి ఫలితానికి ఆస్కారం ఇవ్వకూడదని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు స్థానాలను గెలుచుకోవాలని నిర్ణయించుకుంది. ఆ అవకాశాలు ఉండే అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది. 

ప్రతిపక్ష పార్టీల్లో అయోమయం కలిగించేలా..
టీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లోని పలువురు నేతలు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావును కలిసే ప్రయత్నం చేశారు. అయితే కేటీఆర్‌ మాత్రం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఆశావహులకు సమాచారం పంపించారు. కేరళ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ దగ్గరికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సైతం వెళ్లారు. కేసీఆర్, కేటీఆర్‌ హైదరాబాద్‌కు వచ్చాకే అభ్యర్థులపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. నామినేషన్ల గడువు 14తో ముగుస్తోంది. దానికి ఒకటిరెండు రోజుల ముందు మాత్రమే అభ్యర్థుల ప్రకటనకు అవకాశం ఉందని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.

ప్రతిపక్ష పార్టీల్లో అయోమయం కలిగించేలా ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానంలో టిక్కెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, టీఆర్‌ఎస్‌ నేత తేరా చిన్నపరెడ్డి... వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కపల్లి రవీందర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి... రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కొత్తగా పార్టీలో చేరిన పటోళ్ల కార్తీక్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తోంది.నల్లగొండ స్థానానికి ప్రస్తుత ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ స్థానానికి కె.నవీన్‌రావును ప్రకటించే అంశాన్నీ పరిశీలిస్తోంది.  

సీఎం కేసీఆర్‌తో కేటీఆర్‌... 
దేవాలయాల సందర్శన కోసం కేరళ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ బృందంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా చేరారు. కేటీఆర్‌ సతీసమేతంగా బుధవారం కేరళకు వెళ్లారు. సీఎం కేసీఆర్‌ దంపతులు, కేటీఆర్‌ దంపతులతోపాటు ఎంపీ సంతోష్‌కుమార్‌ ఈ పర్యటనలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌తో కలసి వెళ్లిన కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌... కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌తో భేటీ అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు