ఉద్యమాల ఖిల్లా ఓరుగల్లులో టీఆర్ఎస్ దే హవా!

16 May, 2014 21:03 IST|Sakshi
ఉత్తర తెలంగాణ జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెతున లేచినా.. గతంలో మెజార్టీ సీట్లను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. 2009 ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు సంపాదించి పెట్టాయి. 2014 ఎన్నికలకు వచ్చే సరికి రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడి కొరత స్పష్టంగా కనిపించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య ఓటర్లను ఆకట్టుకోలేకపోవడం పక్కన పెడితే.. కాంగ్రెస్ పార్టీని విజయ పథంలో నడిపించడంలో పూర్తిగా విఫలమయ్యాడని తాజా ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 
 
వరంగల్ పార్లమెంట్: 
వరంగల్ జిల్లా పార్లమెంటరీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన కడియం శ్రీహరి ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటి చేసిన కడియం శ్రీహరి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రధానంగా పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్యనే జరిగింది. సిట్టింగ్ ఎంపీ రాజయ్యపై కడియం శ్రీహరి 373601 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 
 
మహబూబాబాద్ (మానుకోట) పార్లమెంట్: 
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితి విచిత్రంగా కనిపిస్తుంది. మానుకోట నియోజకవర్గం వరంగల్ జిల్లాలో ఉన్నప్పటికి.. ఖమ్మంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి మానుకోట పార్లమెంట్ ను ఏర్పాటు చేశారు. మానుకోట పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరపున బలరాం నాయక్ విజయం సాధించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికైన బలరాం నాయక్ కు కేంద్రమంత్రి హోదా దక్కింది. 
 
2014 ఎన్నికల్లో బలరాం నాయక్ పై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి అజ్మీరా సీతారాం నాయక్  35,653 మెజార్టీతో గెలుపొందారు. అయితే టీడీపీ అభ్యర్ధితోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి తెల్ల వెంకట్రావు కూడా గట్టిపోటి ఇచ్చారు. ఎస్టీ నియోజకవర్గంలో అన్ని పార్టీలు లంబాడా తెగ నుంచి అభ్యర్ధిని పోటిలో పెడితే... కోయ తెగ కు చెందిన వెంకట్రావును వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా బరిలోకి దించింది. వెంకట్రావు కోయ తెగకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమయ్యారు. 
 
వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల వారిగా ఫలితాలను ఓసారి పరిశీలిస్తే...
 
జనగామ
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు హోదాలో కాంగ్రెస్ తరపున రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య బరిలో నిలిచారు. జనగామ నియోజకవర్గంలో ప్రధాన పోటి టీఆర్ఎస్ అభ్యర్ధి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పొన్నాల లక్ష్మయ్యల మధ్య నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో పొన్నాల లక్ష్మయ్య కు ఈ పోటి ఆయనకు ప్రతిష్టాత్మకంగా నిలిచింది. అయితే నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత నుంచి పోలింగ్ కు రెండు మూడు రోజుల ముందు వరకు పొన్నాలనే ఆధిక్యంలో కొనసాగారు. అయితే పోలింగ్ ముందు రెండు మూడు రోజుల్లో పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు సంభవించడం, జనగామలో టీఆర్ఎస్ జోరు ఊపందుకుంది. పొన్నాల లక్ష్మయ్య పై 32910 మెజార్టీతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విజయం సాధించారు. 
 
స్టేషన్ ఘన్‌పూర్(ఎస్సీ)
స్టేషన్ ఘన్‌పూర్(ఎస్సీ) నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలమైన పార్టీగా ఉండేది. అయితే 2009 ఎన్నికల్లో మహానేత వైఎస్ఆర్ ప్రభంజనంతో కాంగ్రెస్ అభ్యర్ధి టీ. రాజయ్య విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన టి.రాజయ్య ఆతర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కడియం శ్రీహరిపై విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది (గతంలో టీఆర్ఎస్ అభ్యర్ధి)  విజయరామారావు, టి. రాజయ్యల మధ్య తీవ్ర పోటి నెలకొంది. అయితే విజయరామారావుపై టీ. రాజయ్య 58687 వేల భారీ మెజార్టీతో తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 
 
పాలకుర్తి
పాలకుర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డి.శ్రీనివాసరావు, టీఆర్ఎస్ అభ్యర్ధి ఎన్.సుధాకర్‌రావుల మధ్య ఉత్కంఠ పోరుకు తెరలేపింది. నువ్వానేనా అనే రేంజ్ లో ప్రచారం సాగింది.  అయితే వరంగల్ జిల్లా రాజకీయాల్లో దశాబ్ద కాలానికి పైగా తనదైన ముద్ర వేసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఎన్నికల్లో కూడా 4313 ఓట్ల మెజార్టీతో ఎన్ సుధాకర్ రావుపై విజయం సాధించారు. 
 
డోర్నకల్
డోర్నకల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం సీనియర్ నేత  సత్యవతి రాథోడ్ ఇటీవల టీఆర్ఎస్ లో చేరారు.  తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ గాలి బలంగా వీచినా సత్యవతి రాధోడ్ విజయాన్ని చేజిక్కించుకోలేకపోయారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి  డీఎస్ రెడ్యానాయక్ చేతిలో 23475 వేల తేడాతో సత్యవతి రాథోడ్ ఓటమి పాలయ్యారు. 
 
నర్సంపేట
వరంగల్ జిల్లాల్లో తెలంగాణవాదాన్ని బలంగా నియోజకవర్గంలో నర్సంపేట ఒకటి. నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ నుంచి దొంతి మాధవరెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి(టీఆర్ఎస్), సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి (టీడీపీ) బలమైన నేతలు. అయితే సునాయాసంగా విజయం సాధిస్తారనుకున్న దొంతిరెడ్డి మాధవరెడ్డి చివరి నిమిషంలో బీ ఫారమ్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగారు. జేఏసీ నేత కత్తి వెంకటస్వామికి చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ను ఖరారు చేసింది. అయితే కీలక పోరులో కత్తి వెంకటస్వామి నామమాత్రంగానే పోటిలో మిగిలారు. ప్రధానంగా  పెద్ది సుదర్శన్‌రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డిల మధ్య పోటి నిలిచింది. అయితే ప్రధాన పార్టీలను పక్కనపెట్టి జిల్లా రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించిన దొంతి మాధవరెడ్డి(స్వతంత్ర)ని 18263 ఓట్ల మెజార్టీతో ప్రజలు గెలిపించుకున్నారు. 
 
మహబూబాబాద్(మానుకోట) (ఎస్టీ)
మానుకోట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ కుమార్తే  ఎం.కవితపై  టీఆర్ఎస్ అభ్యర్ధి వి. శంకర్ నాయక్ 9602 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
 
పరకాల
జిల్లా రాజకీయాల్లో పరకాల నియోజకవర్గం ప్రత్యేకమైంది. గత ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి కొండా సురేఖ టీఆర్ఎస్ అభ్యర్ధి బిక్షపతి చేతిలో తక్కువ తేడాతో ఓటమి పాలైంది. అయితే సాధారణ ఎన్నికల్లో బిక్షపతికి టీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో.. లాయర్ జేఏసీ నేత ఎం.సహోధర్‌రెడ్డి పరకాల బరిలో నిలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి, సహోధర్ రెడ్డిల మధ్య ప్రధాన పోటి నెలకొంది. నువ్వా నేనా అనే రితీలో జరిగిన పోరులో ఎం.సహోధర్ రెడ్డిపై చల్లా ధర్మారెడ్డి 9225 మెజార్టీతో విజయం సాధించారు. 
 
వరంగల్ వెస్ట్
వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఇ. స్వర్ణ పై టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే డి.వినయభాస్కర్ 57110 మెజార్టీతో విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి భీంరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎం.ధర్మారావు (బీజేపీ) కూడా గట్టి పోటి ఇచ్చారు.
 
వరంగల్ ఈస్ట్
వరంగల్ ఈస్ట్ లో ఆసక్టికరమైన పోటి నెలకొంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన బస్వరాజు సారయ్య, కొండా సురేఖ ప్రత్యర్ధులుగా మారారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన కొండా సురేఖ, సిట్టింగ్ ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి బస్వరాజ్ పై 52085 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. 
 
వర్ధన్నపేట (ఎస్సీ)
వర్ధన్నపేట (ఎస్సీ) సిట్టింగ్ ఎమ్మెల్యే  కొండేటి శ్రీధర్ ఓటమి ముందే ఊహించి.. ఆత్మాహత్యాయత్నానికి పాల్పడటం జిల్లా రాజకీయాల్లో సంచలనం రేపింది. అయితే టీఆర్ఎస్ అభ్యర్ధి  ఆలూరు రమేష్ చేతిలో శ్రీధర్ ఓటమి తప్పలేదు. శ్రీధర్ 86094 తేడాతో ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో బరిలో దిగిన మంద కృష్ణ మాదిగ వర్ధన్న పేటలో ప్రభావం చూపలేకపోయారు. 
 
భూపాలపల్లి
భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణరెడ్డిపై సమీప ప్రత్యర్ధి, టీఆర్ఎస్ అభ్యర్ధి ఎస్.మధుసూదనచారి 6284 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 
 
ములుగు (ఎస్టీ)
ములుగు (ఎస్టీ) నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ అభ్యర్ధి పి.వీరయ్య, టీఆర్ఎస్ అభ్యర్ధి అజ్మీరా చందులాల్ ల మధ్య ప్రధాన పోటి నెలకొంది. అయితే సీతక్కపై టీఆర్ఎస్ అభ్యర్ధి అజ్మీరా చందులాల్ 16314 మెజార్టీతో విజయం సాధించారు.

 

మరిన్ని వార్తలు