ఎంపీ టికెట్టు సిట్టింగ్‌కేనా?

5 Mar, 2019 06:25 IST|Sakshi
ఎంపీ బీబీ పాటిల్‌ , మాజీ ఎమ్మెల్యే రవీందర్‌ రెడ్డి

జహీరాబాద్‌ ఎంపీ స్థానంపై టీఆర్‌ఎస్‌లో చర్చ 

అభ్యర్థిని మారుస్తారని ప్రచారం

 బీబీ పాటిల్‌కే అంటున్న అనుచరవర్గం

 సన్నాహక సభతో స్పష్టత వచ్చే అవకాశం 

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీల్లో అభ్యర్థిత్వాలపై కసరత్తు సాగుతోంది. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి టీఆర్‌ఎస్‌ పార్టీ పార్లమెంట్‌ స్థాయి సన్నాహక సదస్సులు నిర్వహిస్తోంది. ఈనెల 13న జహీరాబాద్‌ నియోజకవర్గ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. అయితే అభ్యర్థి ఎవరన్న దానిపై క్యాడర్‌లో జోరుగా చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలోలాగే సిట్టింగ్‌ ఎంపీలకే తిరిగి టికెట్లు ఇస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాక్షి, కామారెడ్డి: పార్లమెంట్‌ ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ సమాయత్తమవుతోంది. లోక్‌సభ నియోజక వర్గాల వారీగా సన్నాహక సభలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 13న జహీరాబాద్‌ నియోజక వర్గ సభను నిజాంసాగర్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరుకానున్నారు. అయితే ఎంపీ టికెట్టు ఎవరికి అన్నదానిపై జోరుగా చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగిన బీబీ పాటిల్‌ విజయం సాధించారు. తిరిగి పోటీ చేయడానికి ఆయన సన్నద్ధమవుతున్నారు. అయి తే బీబీ పాటిల్‌ను వ్యతిరేఖిస్తున్న కొందరు నేతలు తెరపైకి పలువురి పేర్లను తీసుకువచ్చారు. సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న పాటిల్‌కే టికెట్టు వస్తుందని ఆయన అనుచరులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఇప్పటికే టికెట్టు ఖరారు అయ్యిందని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీం దర్‌రెడ్డి ఎంపీ టికెట్టు కోసం ప్రయత్నాలు చేశారు. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడి తనకు మద్దతు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం జరిగింది. ఎంపీ పాటిల్‌కు ఒకరిద్దరు తప్ప మిగతా వారితో అంతగా సత్సంబంధాలు లేవన్న విషయం ప్రచారంలో ఉంది. దీంతో అభ్యర్థిని మార్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారమూ జరుగుతోంది.

సన్నాహక సభతో స్పష్టత!

 జహీరాబాద్‌ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ఈనెల 13న నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు సమీపంలోని మాగి వద్ద టీఆర్‌ఎస్‌ సన్నాహక సభ నిర్వహించనున్నారు. ఈ సభతో ఎంపీ అభ్యర్థిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నా రు. పార్లమెంట్‌ ఎన్నికల టీం లీడర్‌గా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సభకు హాజరుకానున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించడానికి పార్టీ శ్రేణులు ఎలా ముందుకు సాగాలన్నదానిపై ఆయన దిశానిర్దేశం చేస్తారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థిత్వంపై ఆయన స్పష్టత ఇస్తా రని పార్టీ నాయకులు చెబుతున్నారు.

 కేసీఆర్‌ను కలిసన పాటిల్‌

సీఎం కేసీఆర్‌ను ఇటీవల ఎంపీ బీబీ పాటిల్‌ కలిశారని, ఈ సందర్భంగా ఎంపీ టికెట్టుపై సీఎంనుంచి భరోసా లభించిందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి బలమైన క్యాడర్‌ ఉంది. ఎల్లారెడ్డిలో మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఎమ్మె ల్యే ఓటమి చెందినప్పటికీ అక్కడ టీఆర్‌ఎస్‌ బలం గానే ఉంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, ఆంధోల్‌ నియోజక వర్గాల్లో కూడా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ గెలుపు సులువవుతుందని ఎంపీ పాటి ల్‌ అనుచరులు చెబుతున్నారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని, ఆయన విజయం సాధిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు

మరిన్ని వార్తలు