గులా'బీ' ఫారాల పంపిణీ

12 Nov, 2018 14:48 IST|Sakshi
కేసీఆర్‌ నుంచి బీ ఫారం అందుకుంటున్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

బీ–ఫారాలు అందుకున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

ఇకపై ప్రచారానికి మరింత పదును 

డెయిలీ సీరియల్‌ను తలపిస్తున్న మహాకూటమి తీరు

అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జన 

దూసుకెళ్తున్న బీజేపీ, బీఎల్‌ఎఫ్‌లు

టీఆర్‌ఎస్‌ మరింత దూకుడును ప్రదర్శిస్తోంది. తమ పార్టీ తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ–ఫారాలు అందజేసింది. ఆదివారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా.. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు బీ ఫారాలు అందుకున్నారు. కాలె యాదయ్య (చేవెళ్ల), టి.ప్రకాశ్‌గౌడ్‌ (రాజేంద్రనగర్‌), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం), ఎం.రామ్మోహన్‌ గౌడ్‌ (ఎల్బీనగర్‌), అంజయ్య యాదవ్‌ (షాద్‌నగర్‌), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (ఇబ్రహీంపట్నం), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), జైపాల్‌ యాదవ్‌ (కల్వకుర్తి)లు బీ ఫారం తీసుకున్న వారిలో ఉన్నారు. 

సాక్షి, రంగారెడ్డి: అసెంబ్లీని రద్దుచేసి రెండు నెలల కిందటే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం.. చివరకు ఎన్నికల ప్రక్రియలో కీలకమైన బీ– ఫారాల విషయంలోనూ అదే దూకుడును కొనసాగించింది. తొలుత కేసీఆర్‌ ప్రకటించిన 107 మంది అభ్యర్థుల జాబితాలో.. జిల్లాలోని 8 సెగ్మెంట్ల నుంచి బరిలోకి దిగే అభ్యర్థులకు చోటు దక్కింది. ప్రకటన వెలువడినప్పటి నుంచే అభ్యర్థులంతా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా బీ– ఫారాల అందజేతతో వీరంతా ప్రచారానికి మరింత పదును పెట్టేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు.

డెయిలీ సీరియల్‌..  
ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటయిన మహాకూటమి తర్జనభర్జనలు పడుతోంది. కూటిమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఐల సీట్ల సంఖ్య, పోటీ చేసే స్థానాల సంఖ్య కొలిక్కి రాకపోవడంతో అభ్యర్థుల ఖరారు విషయంలో తీవ్ర ఆలస్యమవుతోంది. అభ్యర్థులను ప్రకటిస్తామని నాలుగు రోజులుగా జరుగుతున్న వ్యవహారం డెయిలీ సీరియల్‌ని తలపిస్తున్నాయి. జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో ఎవరు  పోటీ చేస్తారనే విషయంపై దాదాపు ఖరారైనప్పటికీ.. ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాలపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. చివరకు ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే 12న కూడా అభ్యర్థులను ప్రకటిస్తారా లేదా అని సందిగ్ధంగానే ఉంది.
 
బీజేపీ దూకుడు.. 
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ అధిష్టానం అభ్యర్థుల ఖరారులోనూ కాస్త ముందంజలోనే ఉంది. రెండు విడతలుగా ఐదు సెగ్మెంట్ల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌ పెట్టింది. వాస్తవంగా ఆదివారం ఆ పార్టీ ఎన్నికల కమిటీ భేటీ అయితే.. 12న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. అనివార్య పరిస్థితులలో ఈ సమావేశం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పేర్ల వెల్లడికి మరో రెండురోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు