కీలక ఘట్టం

12 Nov, 2018 15:20 IST|Sakshi
జోగిపేటలో నామినేషన్ల పక్రియ గురించి వివరిస్తున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రవి

నేటినుంచే అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు

ఈ నెల 19 వరకు స్వీకరణ

21 సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితా

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల చేతికి  బీ ఫారాలు

కూటమిలో కొలిక్కిరాని సీట్ల సర్దుబాటు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి  : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలక ఘట్టం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నామినేషన్ల స్వీకరణకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు ప్రధాన రాజకీయ పక్షం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తి చేసింది. మిగతా ప్రధాన రాజకీయ పక్షాలు, కూటమిలు తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనా అభ్యర్థులు ఎవరనే అంశంపై స్పష్టత లేక ఆయా పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల నియమావళికి లోబడి నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ ‘సాక్షి’కి వెల్లడించారు.     

ఏర్పాట్లు పూర్తి చేశాం..
సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ ఎం.హనుమంతరావు ‘సాక్షి’కి వెల్లడించారు. నామినేషన్ల దాఖలు కోసం అభ్యర్థితో పాటు మరో ముగ్గురు వ్యక్తులకు మాత్రమే రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి అనుమతి ఉంటుందన్నారు. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వరకు గరిష్టంగా మూడు వాహనాలకు అనుమతిస్తారని, 100 మీటర్ల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ నేరచరిత్ర, ఆస్తుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్‌ను నిర్దేశిత ఫార్మాట్‌లో సమర్పించాల్సిఉంటుందన్నారు. సోమవారం ఉదయం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సంబంధిత ఆర్‌ఓలు నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని కలెక్టర్‌ వెల్లడించారు.

ఎన్నికల షెడ్యూలు
నోటిఫికేషన్‌ విడుదల                : ఈ నెల 12  
నామినేషన్ల స్వీకరణ                 : ఈ నెల 12  
నామినేషన్ల తుది గడువు          : ఈ నెల 19  
నామినేషన్ల పరిశీలన               : ఈ నెల 20  
నామినేషన్ల ఉపసంహరణ         : ఈ నెల 21 
పోలింగ్‌                                 : డిసెంబర్‌ 7 
ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి   : డిసెంబర్‌ 11 

ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్ర శాసనసభను రద్దు చేయడంతో మొదలైన ముందస్తు ఎన్నికల సందడి కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 6న రాష్ట్ర శాసనసభ రద్దు కాగా, ముందస్తు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 6న ఎన్నికల షెడ్యూలును విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఆయా ఆసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్‌ అధికారులు సోమవారం ఉదయం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జిల్లా పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో  ఏర్పాట్లను పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.


 

మరిన్ని వార్తలు