టీఆర్‌ఎస్‌ హయాంలోనే గొల్ల, కురుమలకు ప్రాధాన్యం

13 Nov, 2018 16:59 IST|Sakshi
ప్రచారం రథం పైనుంచి అభివాదం చేస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి   

ఆర్థిక పరిపుష్టి కోసమే గొర్రెలు, గేదెల పంపిణీ  

తాండూరులో యాదవ కమ్యూనిటీ హాల్‌ నిర్మిస్తాం    మళ్లీ టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టండి

మంత్రి మహేందర్‌రెడ్డి

సాక్షి, తాండూరు టౌన్‌: గొల్ల, కురుమ, యాదవులను ఆదుకున్నది కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక భవానీ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం నిర్వహించిన ఆ సంఘం సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గొల్లకురుమలు మంత్రికి గొంగడి కప్పి, గొర్రె పిల్లను బహూకరించారు. అనంతరం మహేందర్‌రెడ్డి డోలు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. కనుమరుగవుతున్న కుల వృత్తులను పరిరక్షించేందుకు కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారన్నారు. ఉపాధి లేక వలస పోతున్న వారికి ఉన్న ఊర్లోనే ఉపాధి చూపించేందుకు పలు సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చారని తెలిపారు.

గొల్ల, కురుమలకు గొర్రెలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వంపై విపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేశాయని మండిపడ్డారు. గొర్రెలు, బర్రెలు ఇచ్చింది విద్యార్థులు వాటిని కాస్తూ బతకమని కాదన్నారు. వారి తల్లిదండ్రులను ఆర్థికంగా బలోపేతం చేసి విద్యార్థుల ఉన్నత చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకే జీవాలు, పాడి గేదెలు అందజేశామని స్పష్టంచేశారు. రాజకీయంగా కూడా గొల్ల, కురుమలకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, లింగయ్యయాదవ్‌ను రాజ్యసభకు పంపిందని గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికీ మటన్, చేపలు వంటివి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దీన్ని అరికట్టేందుకే మన రాష్ట్రంలోనే వీటిని పెంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి ఆర్థిక పుష్టి సాధించేందుకే సీఎం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారని తెలిపారు. ఇంకా గొర్రెలు దక్కని వారికి తిరిగి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. తాండూరులో గొల్ల, కురుమలకు కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి ఇప్పటికే ఎకరా స్థలంతో పాటు రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేశామన్నారు.

నిర్మాణానికి అవసరమైన పూర్తి నిధులను ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆయా కుల సంఘాల వారు శుభకార్యాలు చేసుకునేందుకు ప్రభుత్వం కమ్యూనిటీ హాళ్లను మంజూరు చేసి ప్రొసీడింగ్స్‌ ఇస్తే.. వాటిని చిత్తు కాగితాలని చెబుతున్న కొందరు నేతల మాటలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ముందుస్తు ఎన్నికలు రాకపోతే ఈ సమాయానికి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం పూర్తయ్యేదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మద్దతు పలికి, కారు గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాగారం నర్సింలు, టీఆర్‌ఎస్‌ నాయకులు కరణం పురుషోత్తంరావు, సిద్రాల శ్రీనివాస్, సాయిలుగౌడ్, గౌడి వెంకటేశం, కోహిర్‌ శ్రీనివాస్, పూజారి పాండు, వెంకటయ్య, శకుంతల, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు