‘లోక్‌సభ’ కసరత్తు షురూ..

25 Feb, 2019 04:02 IST|Sakshi

16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యం: ఎమ్మెల్సీ పల్లా

పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశాలకు షెడ్యూల్‌ విడుదల

మార్చి 1 నుంచి 11 వరకు భేటీలు.. హాజరుకానున్న కేటీఆర్‌

ఒక్కో అసెంబ్లీ నుంచి 2,000 మంది నాయకులు, కార్యకర్తలు

ఎంపిక బాధ్యత సీఎం కేసీఆర్‌దేతెలంగాణ భవన్‌లో 

వివరాలు వెల్లడించిన రాజేశ్వర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటు సమరానికి టీఆర్‌ఎస్‌ సమాయత్తమవుతోంది. 16 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించినట్లుగానే ప్రత్యర్థి పార్టీల కంటే ముందే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా కేసీఆర్‌ ఆదేశాల మేరకు పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాల షెడ్యూల్‌ను ఆదివారం తెలంగాణ భవన్‌లో పల్లా రాజేశ్వరరెడ్డి విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాల్లో 16 సీట్లు గెలుచుకుంటామన్నారు. దీని కోసం మార్చి 1 నుంచి పాటించాల్సిన కార్యాచరణను సీఎం కేసీఆర్‌ తెలిపారన్నారు.

ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు గాని, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు గాని పూర్తి మెజారిటీ రాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం అవుతాయన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్నారని తెలిపారు. కేసీఆర్‌ ఆలోచనలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ప్రశంసిస్తున్న విషయాన్ని ఉదహరించారు.

అన్ని సమావేశాల్లోనూ కేటీఆర్‌...
ప్రతీ సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొంటారన్నారు. ఆయా జిల్లాల్లో రాత్రి కేటీఆర్‌ బసచేసి ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. ఒక్కో ఎంపీ నియోజకవర్గంలో 15 వేల మంది (ప్రతీ అసెంబ్లీ స్థానం నుంచి 2000 మంది చొప్పున) పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, పార్టీ జనరల్‌ సెక్రటరీలు, ఇన్‌చార్జిలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులు, గ్రామశాఖాధ్యక్షులు, రైతు సమన్వయ సమితి కో–ఆర్డినేటర్లు పాల్గొంటారన్నారు. ఆయా జిల్లా మంత్రులే సన్నాహక సమావేశాల ఏర్పాట్లు చూసుకుంటారని చెప్పారు.

మంత్రులు లేని జిల్లాల్లో కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తారని వివరించారు. అభ్యర్థుల ఎంపికపై చర్చ ఉండదని, అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సమావేశాలు ఉంటాయన్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపిక పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినా సన్నాహక సమావేశాలు ఆగవన్నారు. ప్రతి పార్లమెంటు నియోజక వర్గంలో 3 నుంచి 4 లక్షల మెజారిటీ లక్ష్యంగా పనిచేస్తామని వివరించారు.

సమావేశాల షెడ్యూల్‌ ఇలా..
►మార్చి 1న కరీంనగర్‌లో (సన్నాహక సమావేశాలు ప్రారంభం) 
►మార్చి 2న ఉదయం వరంగల్, మధ్యాహ్నం భువనగిరి.
►మార్చి 3న ఉదయం మెదక్, మధ్యాహ్నం మల్కాజ్‌గిరి
►మార్చి 6న ఉదయం నాగర్‌కర్నూల్‌ (వనపర్తిలో), మధ్యాహ్నం చేవెళ్ల.
►మార్చి 7న ఉదయం జహీరాబాద్‌ (నిజాంసాగర్‌లో), మధ్యాహ్నం సికింద్రాబాద్‌.
►మార్చి 8న ఉదయం నిజామాబాద్, మధ్యాహ్నం ఆదిలాబాద్‌
►మార్చి 9న పెద్దపల్లి (రామగుండంలో) 
►మార్చి 10న ఉదయం మహబూబాబాద్, మధ్యాహ్నం ఖమ్మం.
►మార్చి 11న ఉదయం నల్లగొండ, మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌

మరిన్ని వార్తలు