‘సహకార’ సంఘాల్లో కారు జోరు

16 Feb, 2020 08:49 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని సహకార సంఘాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ హవా కొనసాగింది. 46 సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌కు 35, కాంగ్రెస్‌కు8, బీజేపీకి ఒకటి , ఇతరులకు రెండు సహకార సంఘాలు(సోసైటీలు) దక్కే అవకాశముంది. మొత్తం 597 డైరెక్టర్ల స్థానాలు ఉండగా, 588 డైరెక్టర్ల స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 9 డైరెక్టర్ల స్థానాలకు వివిధ కారణాల నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికలు జరగాల్సిన 588 డైరెక్టర్ల స్థానాల్లో 143 ఏకగ్రీవం కాగా, ఇందులో అత్యధికంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవాలతో కలుపుకొని..మొత్తంగా 588 డైరెక్టర్ల స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 385 డైరెక్టర్ల స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్‌ 124 ,బీజేపీ 40 ఇతరులు 39 డైరెక్టర్ల స్థానాల్లో విజయం సాధించారు.   

మేడ్చల్‌ జిల్లాలో ఇలా... 
మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో తొమ్మిది సహకార సంఘాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది. 44 డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవం కాగా, ఇందులో అత్యధిక డైరెక్టర్లను టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మిగిలిన 72 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో తొమ్మిది సహకార సంఘాల పరిధిలో మొత్తంగా ఏకగ్రీవాలతో కలుపుకుని 116 డైరెక్టర్ల స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్‌ 94 స్థానాలను, కాంగ్రెస్‌  తొమ్మిది, బీజేపీ  ముగ్గురు, 
ఇతరులు 10 డైరెక్టర్ల స్థానాలను కైవసం చేసుకున్నారు.

జిల్లాలో తొమ్మిది సహకార సంఘాలు ఉండగా, ఇందులో ఐదు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్‌), నాలుగు రైతు సేవా సహకార సంఘాలు( ఎప్‌ఎస్‌సీఎస్‌) ఉన్నాయి. జిల్లాలోని తొమ్మిది సహకార సంఘాల్లో ఛైర్మన్‌తోసహా వైస్‌ చైర్మన్‌ వదవులను చేజిక్కించుకునే డైరెక్టర్ల స్థానాలను  టీఆర్‌ఎస్‌ చేజిక్కించుకుంది. జిల్లా సహకార సంఘాల్లో మొత్తంగా 7,445 మంది సభ్యులు ఉండగా, 6,686 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవటంతో 89.80 శాతం పోలింగ్‌ నమోదైంది.

రంగారెడ్డి జిల్లాలో ఇలా...    
రంగారెడ్డి జిల్లాలో 37 సహకార సంఘాల్లో బండ్లగూడ ఖిల్సా సంఘం ఏకగ్రీవం అయింది. మిగతా 36 సహకార సంఘాల పరిధిలోని 472 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందే 99 డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవం కాగా ఇందులో అత్యధిక స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. ఏకగ్రీవాలను కలుపుకుని మొత్తంగా 37 సహకార సంఘాల పరిధిలోని 481 డైరెక్టర్ల స్థానాలకుగానూ 9 డైరెక్టర్ల స్థానాల్లో వివిధ కారణాల నేపథ్యంలో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 472 డైరెక్టర్ల స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 291, కాంగ్రెస్‌ 115, బీజేపీ 37, ఇతరులు 29 డైరెక్టర్ల స్థానాల్లో విజయం సాధించారు.  

గెలుపొందిన డైరెక్టర్ల స్థానాలను బట్టి రంగారెడ్డి జిల్లాలోని 37 సహకార సంఘాల్లో టీఆర్‌ఎస్‌ 26, కాంగ్రెస్‌ 8, బీజేపీ ఒకటి, ఇతరులు రెండు సంఘాలను చేజిక్కించుకునే అవకాశముంది. రంగారెడ్డి జిల్లాలో సహకార సంఘం ఎన్నికల్లో 69,840 మంది సభ్యులకుగాను 58,126 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవటంతో 83.23 శాతం పోలింగ్‌ నమోదైంది.  

క్యాంపు రాజకీయాలు షురూ...   
సహకార సంఘాల ఎన్నికల్లో డైరెక్టర్ల స్థానాల ఫలితాలు వెలువడటంతో ఆదివారం చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక కార్యక్రమం కొనసాగనుంది. అధికార టీఆర్‌ఎస్‌ పారీ్టతో సహా కాంగ్రెస్, ఇతరుల్లో ఆధిపత్య పోరు కొనసాగుతుండటంతో డైరెక్టర్ల మద్దతు కోసం క్యాంపు రాజకీయాలకు శనివారం రాత్రి నుంచి తెరలేపారు. గెలుపొందిన డైరెక్టర్లను అక్కడ నుంచి నేరుగా అధికార టీఆర్‌ఎస్‌ నాయకులు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు సూచనల మేరకు క్యాంపులకు తరలిచ్చినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే బుక్‌ చేసుకున్న రిసార్టులు, హోటళ్లకు నేరుగా సంఘాల డైరెక్టర్లను తరలించారు.   

మరిన్ని వార్తలు