సమ్మెను పట్టించుకోని ప్రభుత్వం..మళ్లీ అదే పని

26 Oct, 2019 07:59 IST|Sakshi

కొత్త నోటిఫికేషన్‌లో 74 బస్సులు

ఇటీవలే 18 బస్సుల టెండర్లు పూర్తి     

సాక్షి, ఆదిలాబాద్‌ : మళ్లీ అద్దె బస్సుల కోసం టెండర్‌ వేశారు. ఆర్టీసీలో కొత్తగా అద్దె బస్సులు తీసుకునేందుకు తిరిగి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఒకవైపు కార్మికుల సమ్మె కొనసాగుతుండగా, మరోవైపు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు కొనసాగిస్తోంది. ఇటీవల అద్దె బస్సుల టెండర్ల విషయంలో కార్మికులు ఆందో ళన వ్యక్తం చేసినా, మొదటి దఫా ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండానే మరో దఫా టెండర్లకు సిద్ధం కావడం గమనార్హం. 

అన్ని డిపోల కోసం..
సమ్మె సమయంలోనే మరోసారి అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఈ విడతలో పెద్ద ఎత్తున బస్సులను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తిగల నిర్వాహకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆదిలాబాద్, భైంసా, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, ఉట్నూర్‌ డిపోల నుంచి వివిధ రూట్లలో బస్సులను నడిపేందుకు టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియకు శనివారం చివరి రోజు. ఆదిలాబాద్‌ ఆర్‌ఎం కార్యాలయంలో ఉంచిన టెండర్‌ బాక్సులో దరఖాస్తు దాఖలు చేయాలి. సాయంత్రమే వీటికి సంబంధించి టెండర్‌ను ఖరారు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

పెరుగుతున్న సంఖ్య..
ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలోని ఆరు డిపోలు ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల్లో కలిపి మొత్తంగా నిత్యం 625 బస్సులు ఉన్నాయి. ఇందులో 181 అద్దె బస్సులు ఉండగా, మిగతావి ఆర్టీసీవి. ప్రభుత్వం ఈ రెండు నోటిఫికేషన్‌ల ద్వారా వందకుపైగా అద్దె బస్సులను తీసుకుంటోంది. తద్వారా ఆర్టీసీలో వీటి సంఖ్య గణనీయంగా పెరగనుంది. ఒకవైపు సమ్మె చేస్తున్న కార్మికులు టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఇవన్నేమీ పట్టించుకోకుండా ప్రత్యామ్నాయ చర్యలను నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం టెండర్‌ ప్రక్రియ విషయంలో కార్మికులు మరోసారి ఆందోళనకు దిగే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోవద్దంటూ కార్మికులు హెచ్చరిస్తున్నారు. సమ్మెకు ముందు ఆర్టీసీ బస్సులు రోజు 2.50 లక్షల కిలోమీటర్లు తిరిగి సుమారు 3లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతోంది. తద్వారా ఆర్టీసీకి రోజూ రూ.75లక్షల నుంచి రూ.80లక్షల వరకు ఆదాయం లభించేది. సమ్మె తర్వాత ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యల ద్వారా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఇప్పటికీ రోజువారి ఆదాయం విషయంలో ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. తద్వారా నడుస్తున్న కొద్దిపాటి బస్సుల ద్వారా వస్తున్న ఆదాయం ఎటు పోతుందన్న ప్రశ్న తలెత్తుతోంది.

కొనసాగుతున్న సమ్మె
ఆదిలాబాద్‌ రీజియన్‌లో సమ్మె 21 రోజులుగా కొనసాగుతోంది. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు తాత్కాలిక డ్రైవర్లను నియమించి నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నా అవి పూర్తిస్థాయిలో సఫలం కావడంలేదు. శుక్రవారం రీజియన్‌ పరిధిలో 326 ఆర్టీసీ బస్సులను నడిపించాలని లక్ష్యం పెట్టుకున్నా కేవలం 262 బస్సులను నడిపినట్లు అధికారులే చెబుతున్నారు. అద్దె బస్సులు 172కు గాను 166 నడిపించారు. మొత్తంగా ఆర్టీసీ, అద్దె బస్సులు కలిపి 478 నడిపించాలని అనుకున్నా 428 బస్సులు తిరిగినట్లు చెబుతున్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు రాజకీయ ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి సంఘీభావం లభించింది. 

ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతోనే..
ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అద్దె బస్సులను కొత్త నోటిఫికేషన్ల ద్వారా తీసుకుంటోంది. ఇది సబబు కాదు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ ఉద్దేశం సరికాదు. కార్మికులు సమ్మెలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యవహారాలు తగదు. 
– బీడీ చారి, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ 

ప్రభుత్వ ధోరణితోనే సమస్య 
ప్రభుత్వ ధోరణితోనే సమస్య జఠిలమవుతోంది. సమ్మె కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వ్యవహరిస్తోంది. చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నాం. విలీన డిమాండ్‌ ఒక్కటే కాకుండా ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి. అవన్ని పరిష్కార యోగ్యమైనవే. కాని చర్చల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడంలేదు.
– ఎంఆర్‌ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్‌  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు