మరో నలుగురు

27 Jul, 2019 01:14 IST|Sakshi

ఆగస్టు మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ.. 

హరీశ్, కేటీఆర్, సబితతోపాటు తుమ్మలకు అవకాశం 

దాదాపుగా ఖరారైన జాబితా

మున్సిపల్‌ ఎన్నికల తర్వాత మరో ఇద్దరికి చాన్స్‌ 

గుత్తా, లక్ష్మారెడ్డికి కేబినెట్‌లో చోటు!

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌ : ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించే అవకాశముంది. అత్యున్నత విశ్వస నీయవర్గాల సమాచారం ప్రకారం ఈ విస్తరణలో నలుగురు సీనియర్‌ నేతలకు చోటు లభించనుందని తెలిసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారని, ఆగస్టు 6వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపుగా ఖరారైందని విశ్వసనీయ సమాచారం. మంత్రివర్గంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి సహా 12 మంది మంత్రులున్నారు. పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరిస్తే ఆరుగురిని తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి నలుగురికే అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు. మునిసిపాలిటీ ఎన్నికల తరువాత మరో ఇద్దరికీ అవకాశం ఉంటుందని సమాచారం.

ఉమ్మడి కరీనంగర్‌ జిల్లా నుంచి ఇప్పటికే ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌ మంత్రివర్గంలో ఉన్నారు. త్వరలో జరగబోయే విస్తరణలో సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్‌కు అవకాశం వస్తే అక్కడి నుంచి మంత్రివర్గంలో ముగ్గురికి స్థానం లభిస్తుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి ప్రస్తుతం కేసీఆర్‌ ఒక్కరే ఉన్నారు. తదుపరి విస్తరణలో సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్‌రావుకు స్థానం లభిస్తుంది. టీఆర్‌ఎస్‌ తొలి ప్రభుత్వంలో కేబినెట్‌లో ఉన్న కేటీఆర్, హరీశ్‌ రావులను ఈ సారి మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం రాజకీయవర్గాల్లో సంచలనమైంది. మంత్రివర్గంలో స్థానం లభించని కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడయ్యారు. హరీశ్‌రావు మాత్రం ఎనిమిది నెలలుగా సిద్దిపేటతో పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లా కార్యకలాపాలకు పరిమితమయ్యారు. 

తుమ్మలకు మరో చాన్స్‌ 
శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేసిన మాజీ రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఆ జిల్లాలో ఖమ్మం మినహా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో తనకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ భావించారు. పార్టీ అంతర్గత కలహాల కారణంగా తుమ్మల ఓడిపోయారని భావిస్తున్న కేసీఆర్‌ చివరకు ఆయన్నే మంత్రివర్గంలోని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. గడచిన ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు టిక్కెట్‌ కేటాయించినప్పుడే తుమ్మలకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని సీఎం హమీ ఇచ్చినట్లు సమాచారం. 

మునిసిపల్‌ ఎన్నికల తర్వాత ఇద్దరికి 
మునిసిపిల్‌ ఎన్నికల తరువాత మరో ఇద్దరికీ కేబినెట్లో స్థానం లభించే అవకాశముంది. రాష్ట్ర రైతు సాధికార కమిషన్‌ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాజీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి అవకాశం దొరకవచ్చని ప్రచారం జరుగుతోంది. భవిష్యత్‌లో మంత్రివర్గంలో తీసుకుంటానని లక్ష్మారెడ్డికి సీఎం హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ముగ్గురికి ప్రాతినిధ్యం లభించినట్లు అవుతుంది. ఇప్పటికే వి.శ్రీనివాస్‌ గౌడ్, ఎస్‌.నిరంజన్‌రెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు.   

తెలంగాణ తొలి మహిళా మంత్రి సబిత
మంత్రివర్గ విస్తరణలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి స్థానం లభిస్తే.. ఆమె తెలంగాణ తొలి మహిళా మంత్రి కానున్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మంత్రివర్గంలో ఇప్పటిదాకా మహిళలకు ప్రాతినిధ్యం లభించలేదు. మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం లేదంటూ శాసనసభలో కాంగ్రెస్‌ విమర్శించగా.. ఈ సారి ఇద్దరు మహిళలకు మంత్రిపదవులు దక్కుతాయని సీఎం పేర్కొన్న సంగతి తెలిసిందే. 2018 శాసనసభ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయం సాధించిన సబిత తదనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మూడింట రెండొంతుల మంది టీఆర్‌ఎస్‌లో చేరడంతో సబిత అధికారికంగానే టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులయ్యారు. 

మరిన్ని వార్తలు