రబీకి ఫుల్‌ కరెంట్‌

3 Jun, 2017 01:02 IST|Sakshi
రబీకి ఫుల్‌ కరెంట్‌

► యాసంగి నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌
►రాష్ట్రావతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్‌
►సాగును లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం
►ఇందుకు 6 సూత్రాల ప్రణాళిక
►మాతాశిశువులకు ప్రభుత్వ ఆత్మీయ కానుకలు
►నేటి నుంచి కేసీఆర్‌ కిట్స్, రేపట్నుంచి ఒంటరి మహిళలకు జీవనభృతి
►డిసెంబర్‌లోగా అన్ని గ్రామాలకు నదీజలాలు
►ఈ నెలలోనే గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం


హైదరాబాద్‌: వచ్చే యాసంగి (రబీ) నుంచే వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని.. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రెండు పంటలకు కలిపి రూ.8 వేలు అందజేస్తామని తెలిపారు. ఇక ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ సురక్షిత తాగునీటిని అందజేస్తామన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక అతితక్కువ వ్యవధిలోనే తెలంగాణ ప్రభుత్వం సకల జనులకు సంక్షేమాన్ని పంచిందని.. పేద ప్రజల ఆత్మవిశ్వాసం పెంచిందని పేర్కొన్నారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గన్‌పార్కులో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. అనంతరం సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు దళాల వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ శుభాకాంక్షలు తెలిపారు. ‘అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం.. కరువంటూ, కాటకమంటూ కనిపించని కాలాలెపుడో..’అన్న మహాకవి దాశరథి వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆ వాక్యాలు తన మదిలో నిరంతరం మెదులుతుంటాయని.. ఆ కవి స్వప్నించిన శ్రేయోరాజ్యంగా తెలంగాణను తీర్చిదిద్దేంత వరకు త్రికరణ శుద్ధితో, అంకితభావంతో అవిశ్రాంతంగా కృషి చేస్తానని కేసీఆర్‌ ప్రతినబూనారు. వేడుకల్లో కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

లాభసాటి వ్యవసాయం కోసం ప్రణాళిక
‘‘వ్యవసాయం దండుగ కాదు, పండుగ అని నిరూపించడానికి ఇప్పటిదాకా చేపట్టిన చర్యలు సరిపోవు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం చాలా ఆలోచన చేసింది. రైతులు, వ్యవసాయ నిపుణులతో చర్చలు జరిపి పటిష్టమైన కార్యాచరణ అమలుకు శ్రీకారం చుట్టింది. రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చడం, ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేసి సాగునీరు అందించడం, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, ఎకరానికి రూ. 8 వేల చొప్పున వ్యవసాయానికి పెట్టుబడిగా అందించడం, రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజించడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం.. ఇలా ఆరు అంశాలతో సమగ్ర ప్రణాళికలు రూపొందించింది. 5 వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించింది. గ్రామాల్లో భూములు, రైతుల వివరాల సేకరణకు సర్వే జరుగుతోంది. సర్వే పూర్తయ్యాక గ్రామ రైతు సంఘాలు, మండల రైతు సమాఖ్యలు, జిల్లా రైతు సమాఖ్యలు, రాష్ట్ర సమాఖ్య ఏర్పాటవుతాయి.

ఎవరు అడ్డుకున్నా ఆగదు
కొన్ని శక్తులు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు దుష్ట ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అయినా ఏటా రూ. 25 వేల కోట్ల భారీ బడ్జెట్‌ కేటాయించి మరీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వ ముమ్మరం చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి రూ.8 వేలను రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తాం. రాష్ట్రం మొత్తాన్ని పంటల కాలనీలుగా విభజిస్తాం. దాంతో రైతులంతా ఒకే పంట వేసి నష్టపోయే పరిస్థితి ఉండదు. రాష్ట్ర రైతు సమాఖ్యకు ప్రభుత్వం రూ.500 కోట్ల నిధిని సమకూరుస్తుంది. పంటల కొనుగోలుకు ఆ మూలధనాన్ని వినియోగించి.. కనీస మద్దతు ధర అందడానికి రైతు సంఘాలు కృషి చేస్తాయి.

ఉమ్మడి రాష్ట్రంలోనే సంక్షోభం
సమైక్య రాష్ట్రంలో అమలైన వివక్షాపూరిత విధానాల వల్ల తెలంగాణ రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయింది. దాంతో రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.17 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసింది. మిషన్‌ కాకతీయ ద్వారా గత రెండేళ్లలో 16 వేల చెరువులు పునరుద్ధరించుకున్నం. ఈ ఏడాది 5 వేలకుపైగా చెరువుల పనులు జరుగుతున్నాయి. ఎరువులు, విత్తనాలను ముందుగానే సిద్ధం చేస్తున్నం. పాలిహౌస్, గ్రీన్‌హౌస్‌ సాగు, మైక్రో ఇరిగేషన్‌కు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తున్నం.

యాసంగి నుంచే 24 గంటల విద్యుత్‌
విద్యుత్‌ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అపూర్వ విజయం సాధించింది. కొరతను అధిగమించి.. కోతల్లేని నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేసే స్థితికి వచ్చాం. ఈ ఏడాది యాసంగి పంటకాలం నుంచే రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కృషి ఫలించి మూడు దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలు పూర్తిగా తొలగిపోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. మిషన్‌ భగీరథ ద్వారా ఈ ఏడాది డిసెంబర్‌ నెలాఖరు వరకు అన్ని గ్రామాలకు నదీ జలాలు అందే అవకాశముంది. దాంతో తాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరుతాయి. ప్రజలకు మంచినీరు అందించే విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శమవుతుంది.

అవతరణ ఆత్మీయ కానుకలు
రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా ప్రభుత్వం మరో రెండు మానవీయ నిర్ణయాలు తీసుకుంది. ఎవరూ తోడులేక కష్టాలు అనుభవిస్తున్న ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున జీవన భృతి చెల్లింపు ఎల్లుండి (ఆదివారం) నుంచే అందుతుంది. మాతాశిశు సంరక్షణకు ఉద్దేశించిన రూ.15 వేల విలువైన ‘కేసీఆర్‌ కిట్‌’పథకం రేపట్నుంచే (శనివారం) అమల్లోకి వస్తుంది. గర్భిణులు కూలికి వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండి, పోషకాహారం తీసుకోవాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుని పండంటి బిడ్డలకు జన్మనివ్వాలనే తలంపుతో కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆత్మీయమైన కానుక.

ఆదాయ వృద్ధిలో అగ్రస్థానం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా విలసిల్లుతుందని ఉద్యమ సమయంలో నేను చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఇటీవల కాగ్‌ వెల్లడించిన నివేదిక ప్రకారం 2016–17 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ 17.82 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వకారణం. పటిష్టమైన, ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణతోనే ఇది సాధ్యమైంది.

వచ్చే నెలలో హరితహరం మూడోదశ
పచ్చదనం పెంపొందించడం కోసం రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’మూడోదశ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ప్రజలందరూ ఉత్సాహంగా అందులో పాలుçపంచుకోవాలి. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఐటీ రంగంలో పెట్టుబడులు, ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రం నలుమూలలా రహదారులన్నీ చక్కగా తీర్చిదిద్దుతున్నాం. పారిశ్రామిక ప్రగతికి ఉద్దేశించిన టీఎస్‌–ఐపాస్‌ చట్టం సత్ఫలితాలను సాధిస్తోంది..’’

ఈ నెల నుంచే గొర్రెల పంపిణీ
గొల్లకుర్మలకు 75 శాతం భారీ సబ్సిడీతో గొర్రెల యూనిట్లను అందజేసే పథకం ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. తొలిదశలో రూ.5 వేల కోట్లతో 84 లక్షల గొర్రెలను అందిస్తాం. ఇక చేపల పెంపకానికి అవసరమయ్యే మొత్తం పెట్టుబడిని భరించి.. లాభాలను బెస్త, ముదిరాజ్‌ తదితర మత్స్యకారులకు అందిస్తాం. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సమగ్ర చేనేత విధానాన్ని రూపొందించాం. నూలు, రసాయనాలను యాభై శాతం సబ్సిడీతో అందిస్తాం. చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చాం. ఆధునిక క్షౌ రశాలల ఏర్పాటు కోసం నాయీ బ్రాహ్మణులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం. రజకులకు బట్టలుతికే అధునాతన యంత్రాలు, విశ్వబ్రాహ్మణులకు వృత్తి పరికరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

కల్లుగీత వృత్తిని ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఈత, తాటిచెట్ల పెంపకం చేపడతాం. అనివార్య పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వృత్తులకు మారే వారికి కూడా తగిన ఆర్థిక తోడ్పాటు అందిస్తాం. అత్యంత వెనుకబడిన సంచార, ఆశ్రిత కులాలను, వర్గాలను అభివృద్ధి చేసేందుకు రూ.1,000 కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్‌ పలు పథకాలు రూపొందిస్తుంది. 5 వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించింది. గ్రామాల్లో భూములు, రైతుల వివరాల సేకరణకు సర్వే జరుగుతోంది. సర్వే పూర్తయ్యాక గ్రామ రైతు సంఘాలు, మండల రైతు సమాఖ్యలు, జిల్లా రైతు సమాఖ్యలు, రాష్ట్ర సమాఖ్య ఏర్పాటవుతాయి.

తెలంగాణ వేగంగా పురోగమించాలి: మోదీ
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా పురోగతి సాధించాలని కోరుకుంటున్నట్లు ట్వీటర్‌లో ట్వీట్‌ చేశారు.

సంక్షేమానికే రూ.40 వేల కోట్లు
రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో సింహభాగం ప్రజా సంక్షేమానికే ఖర్చు పెడుతున్నాం. రూ.40 వేల కోట్లతో 35 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు కొత్తగా 512 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటయ్యాయి. ఎస్సీ మహిళల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు నడుపుతున్నట్లే... వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్టీ మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు ప్రారంభిస్తున్నాం. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, ప్రతి ఒక్కరికీ నెలకు ఆరుకిలోల బియ్యం, చదువుకునే పిల్లలకు సన్న బియ్యం అన్నం అందిస్తున్నాం. బడుగులు గౌరవంగా బతికేందుకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మిస్తున్నాం. క్షేత్రస్థాయిలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి, వారి జీతాలు భారీగా పెంచుకున్నాం.

మరిన్ని వార్తలు