రీ డిజైన్‌ పేరుతో లూటీ.. 

3 Jul, 2019 11:29 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రఘునందన్‌రావు  

సాక్షి, ఇల్లెందు : ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని, అక్రమార్జనకు పాల్పడిన ప్రతీ పైసా బయటకు తీయిస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అన్నారు. ఇల్లెందులోని ఐతావారి ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రీ డిజైన్‌ పేరిట సీతారామ  ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ. 7 వేల కోట్ల నుంచి రూ. 14,500 కోట్లకు పెంచారని,  ఏ ఇంజనీర్‌ సర్వే చేసి మార్పు చేశారో వెల్లడిస్తారా అని ప్రశ్నించారు. రెట్టింపు ప్రజాధనం కొల్లగొట్టేందుకే  ఇష్టారాజ్యంగా పెంచేశారని ఆరోపించారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ అన్నీ ఒకే కాంట్రాక్టర్‌కు ధారాదత్తం చేస్తున్నారని, ఏడేళ్ల క్రితం 100 కోట్ల ఆస్తి కూడా లేని ఆ సంస్థ నేడు వేల కోట్లకు పడగెత్తిందని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, ప్రాజెక్టుల మాటున సాగుతున్న అవినీతిని మాత్రమే ప్రశ్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి ప్రారంభమైందని తెలిపారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్టీ సభ్యత్వం 11 కోట్లు ఉందని, ఈ సంఖ్యను రెట్టింపు చేసేలా కార్యాచరణ సాగుతోందని తెలిపారు. ప్రతి  బూత్‌లో 100 మంది సభ్యులు ఉండేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘సర్వ స్పర్శ బీజేపీ – సర్వ వ్యాప్తి బీజేపీ’ అనే నినాదంతో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుడుతున్నట్లు  తెలిపారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జ్‌ సారంగుల అమర్‌నా«థ్‌ మాట్లాడుతూ.. ఈనెల 6 నుంచి ఆగస్టు 11 వరకు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సాగుతుందని, తొలి సభ్యత్వాన్ని దేశ ప్రధాని మోదీ స్వీకరించనున్నారని తెలిపారు. తెలంగాణలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చేతుల మీదుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదుకు ఒక కస్టమర్‌ కేర్‌ నంబర్‌ ఉంటుందని, మిస్‌కాల్‌ ఇస్తే ఒక లింక్‌ వస్తుందని, ఆ లింక్‌ ఓపెన్‌ చేస్తే ధరఖాస్తు ఫామ్‌ ఉంటుందని, దాన్ని పూరించి పంపిస్తే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసినట్టేనని వివరించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని, కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాల్టీలు కైవసం చేసుకునేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  

అటవీ ఉద్యోగులపై దాడులు హేయం... 
ఇటీవల కాలంలో రాష్ట్రంలో అటవీ ఉద్యోగులపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులు హేయనీయమని అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై కేసు నమోదు ఘటనను ఆయన ఉదహరించారు. సభ్యత్వ నమోదుతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు బీజేపీ పట్టణ   కార్యాలయాన్ని రఘునందన్‌రావు ప్రారంభించారు. సమావేశాల్లో పార్టీ నాయకులు చిలుకూరి రమేష్, ముస్కు శ్రీనివాసరెడ్డి, భూక్యా సీతారాం నాయక్, చింతలచెరువు శ్రీనివాస్, బెహరయర్రం రాజు, కుంజా ధర్మా, బిందె కుటుంబరావు, భూక్యా ప్రసాద్, జంపన సీతారామరాజు, యన్నం వెంకటేశ్వర్లు, భూక్యా దివ్యశ్రీ, ఏనుగుల వెంకటరెడ్డి, కె. సంజీవరెడ్డి, మావునూరి మాధవ్, గుగులోతు రాంచందర్‌నాయక్, శాసనాల రామయ్య, శ్రీనివాస్, దోమల మహేశ్వర్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా