ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి 

13 Feb, 2019 02:47 IST|Sakshi

బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కసరత్తు

ఆసరా పెన్షన్లు, రైతు బంధు పెంపు

రుణ మాఫీ అమలుకు నిధుల కేటాయింపు

నిరుద్యోగ భృతి, ఉద్యోగుల రిటైర్మెంట్‌పై ప్రకటన

ఐదారు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు  

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’నినాదంతో తమ ప్రభుత్వం పని చేస్తోందంటూ తరచూ చెప్పే సీఎం కేసీఆర్‌ త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో దీన్ని ప్రతిబింబించాలని భావిస్తున్నారు. ఈసారి ప్రవేశపెట్టేది తాత్కాలిక బడ్జెటే అయినా ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల కేటాయింపు, విధాన ప్రకటనలను ఇందులో పొందుపరచడం ద్వారా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లకుగాను 16 సీట్లను గెలుచుకోవాలనుకుంటున్నారు. ఎన్నికల హామీల అమలుకు అవసరమైన నిధుల లెక్కలను ఆర్థికశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. ఫిబ్రవరి 20 తర్వాత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మొదలు కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే పరిస్థితుల నేపథ్యంలో ఐదారు రోజుల్లోనే బడ్జెట్‌ సమావేశాలను ముగించాలని సీఎం భావిస్తున్నారు. 

టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలివే..

  • ఆసరా పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తామని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. వికలాంగుల పెన్షన్లను రూ. 1,500 నుంచి రూ.3,016 వరకు పెంచుతామని పేర్కొంది. మిగిలిన అన్ని రకాల ఆసరా పెన్షన్లను రూ. 1,000 నుంచి రూ. 2,016 వరకు పెంచుతామని మేనిఫెస్టోలో తెలిపింది. అలాగే బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ తేదీని 2018 వరకు పొడిగింపుతోపాటు వృద్ధాప్య పెన్షన్‌ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు అంశాలు టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళికలో ఉన్నాయి. 
  • రైతుబంధు కింద ఏటా ఎకరాకు అందిస్తున్న సాయాన్ని రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు. రూ. లక్ష వరకు పంట రుణాల మాఫీ, రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి. 
  • ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను అమలు చేయడం. రెడ్డి, వైశ్య కార్పొరేషన్‌తో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల కోసం కార్పొరేషన్ల ఏర్పాటు. వివిధ కులాల కేటగిరీ మార్పు విజ్ఞాపనల పరిశీలన. అగ్రవర్ణ కులాల్లోని పేదల అభ్యున్నతికి ప్రత్యేక పథకాల అమలు. 
  • డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకాన్ని ప్రస్తుత పద్ధతిలో కొనసాగిస్తూనే సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్రూం నిర్మాణం కోసం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు అందజేయడం. 
  • అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాల పరిష్కారం, యాజమాన్య హక్కుల కల్పన. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలకు సత్వర పరిష్కారం. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలు వర్తింపు.
  • కంటి వెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాల ఏర్పాటు. ప్రతి వ్యక్తి హెల్త్‌ ప్రొఫైల్‌ రికార్డు చేసి తెలంగాణ రాష్ట్ర హెల్త్‌ ప్రొఫైల్‌ తయారీ. 
  • బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు చర్య లు. సింగరేణి భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారికి పట్టాలు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దే ప్రయత్నాలు.  ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు. ఐకేపీ ఉద్యోగులను పర్మనెంట్‌ చేసి, యూనిట్ల నిర్వ హణ బాధ్యత మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగింత.   

ఒక్కొక్కటిగా అన్నీ... 
ఎన్నికల హామీల అమలు విషయంలో సీఎం కేసీఆర్‌ అన్ని పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకొని వెంటనే అమలు చేసే హామీలు ఏమిటనే జాబితా రూపొందిస్తున్నారు. హామీల అమలు విషయంలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతామని పేర్కొంది. ఈ హామీ వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి తలెత్తకుండా నియామక వయోపరిమితిని మూడేళ్లు పెంచనున్నట్లు హామీ ఇచ్చింది. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటామని, నిరుద్యోగలకు రూ. 3,016 భృతి చెల్లిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల విషయంలో బడ్జెట్‌లోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు